Chandrababu Naidu: ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం: సీఎం చంద్రబాబు

Chandrababu Condemns YSRCP Leaders Comments on Vemireddy Prasanthi Reddy
  • కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు
  • ఖండించిన సీఎం చంద్రబాబు
  • మహిళలను దూషించడం వైసీపీ రాజకీయ సిద్ధాంతంగా మారిందని విమర్శ
  • ఓటమికి కారణం తెలిసినా వైసీపీ నేతల తీరు మారడం లేదని వ్యాఖ్య
  • మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం నీచ సంస్కృతికి నిదర్శనమన్న సీఎం
  • ఇకపై మహిళలను కించపరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు.

"కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం. ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ నేతల తీరులో మార్పు రావడం లేదు. మహిళలను దూషించడం, బూతులు తిట్టడం, కించపరచడం అనేది ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుంది. మహిళలను అవమానపరచడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉంది. వారి ఘోర ఓటమికి ఇలాంటి పోకడలు ఒక కారణమని తెలిసినా వారి సహజ గుణంలో మార్పు రావడం లేదు. 

చెల్లి పుట్టుకపైనా వ్యాఖ్యలు చేసిన వారి నాయకత్వంలో పనిచేస్తోన్న నేతలు అంతే దారుణంగా, అసహ్యంగా మాట్లాడుతూ వారి నీచ సంస్కృతిని చాటుకుంటున్నారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వీరు మనుషులేనా? ఇది రాజకీయమా? మహిళల, మహిళానాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, ప్రణాళికాబద్దంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడు గమనించాలి. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠినచర్యలు ఉంటాయి" అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Vemireddy Prasanthi Reddy
Nallapureddy Prasannakumar Reddy
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
YSRCP
Telugu Desam Party
Women safety
Political Comments
Andhra Pradesh Politics

More Telugu News