CAQM: ఢిల్లీలో పాత వాహనదారులకు ఊరట... ఇంధనంపై నిషేధం నవంబర్‌కు వాయిదా

CAQM Relaxes Old Vehicle Fuel Ban Deadline in Delhi to November
  • ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పాత వాహనాల యజమానులకు తాత్కాలిక ఊరట
  • ఇంధనం నింపడంపై నిషేధాన్ని నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసిన కేంద్ర కమిటీ
  • జూలై 1 నుంచి అమలవ్వాల్సిన నిబంధనపై ఢిల్లీ ప్రభుత్వ అభ్యంతరం
  • 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఈ నిబంధన వర్తింపు
  • ఏఎన్‌పీఆర్ కెమెరాల ద్వారా కాలం చెల్లిన వాహనాల గుర్తింపు
  • ఢిల్లీతో పాటు మరో ఐదు ఎన్‌సీఆర్ జిల్లాల్లో నవంబర్ నుంచి కఠినంగా అమలు
దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో (ఎన్‌సీఆర్) కాలం చెల్లిన వాహనాల యజమానులకు కేంద్ర వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) తాత్కాలికంగా ఊరట కల్పించింది. పాత వాహనాల్లో ఇంధనం నింపడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాల అమలును ఈ ఏడాది నవంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ నిబంధన జూలై 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది.

గడువు ముగిసిన వాహనాల వల్ల వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం అమ్మరాదని సీఏక్యూఎం గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం తొందరపాటు చర్య అవుతుందని, దీని అమలుకు అవసరమైన కార్యాచరణ, మౌలిక సదుపాయాల పరంగా సవాళ్లు ఉన్నాయని ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా సీఏక్యూఎంకు లేఖ రాశారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో ఈ అంశాన్ని సమీక్షించిన కమిటీ, నిషేధం అమలును వాయిదా వేయాలని నిర్ణయించింది.

ఈ కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి ఢిల్లీతో పాటు గుర్గావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్ జిల్లాల్లో అమల్లోకి రానుంది. దీనికోసం పెట్రోల్ బంకుల వద్ద ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి, 'వాహన్' డేటాబేస్ ద్వారా దాని వయసును గుర్తిస్తాయి. వాహనం కాలం చెల్లినదని తేలితే, ఇంధనం నింపవద్దని సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. నిబంధనల ఉల్లంఘనలను నమోదు చేసి, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపిస్తాయి. ఈ ఐదు జిల్లాల్లో అక్టోబర్ 31 నాటికి కెమెరాల ఏర్పాటు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
CAQM
Delhi
Old Vehicles
Air Quality
Manjinder Singh Sirsa
Vehicle Ban
CNG
NCR
Pollution
Diesel Petrol

More Telugu News