Bhatti Vikramarka: కేసీఆర్‌కు సవాల్ విసిరితే.. బీఆర్ఎస్ నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Criticizes KTR on KCR Assembly Challenge
  • మహబూబాబాద్‌లో రూ.295 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • అసెంబ్లీకి రమ్మంటే ప్రెస్ క్లబ్‌కు వెళ్తున్నారు: భట్టి విమర్శ
  • ఆ అహంకారం వల్లే లోక్‌సభలో బీఆర్ఎస్‌కు సున్నా
  • లక్ష కోట్లతో బీఆర్ఎస్ పాలకుల విఫల యత్నంపై ఫైర్
ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే, బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రెస్ క్లబ్‌లకు వెళ్లి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ నేతల అహంకారపూరిత వైఖరి వల్లే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదని, ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులోనూ అదే ఫలితం పునరావృతం కావడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కేసముద్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క తదితరులతో కలిసి భట్టి విక్రమార్క రూ.294.78 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని, మూడు నెలల్లో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. పంటకు రూ.500 బోనస్ ఇవ్వడం అన్యాయం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై భట్టి విమర్శలు గుప్పించారు. "రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కనీసం పది వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని వారు మాపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది" అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని, నీటి వాటాలపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

ఇదే సభల్లో మాట్లాడిన ఇతర మంత్రులు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ నేతలు ప్రజలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Bhatti Vikramarka
KCR
Revanth Reddy
BRS Party
Telangana Assembly
Lok Sabha Elections

More Telugu News