DY Chandrachud: ప్రభుత్వ బంగ్లా వివాదం.. అసలు కారణం చెప్పిన మాజీ సీజేఐ చంద్రచూడ్

DY Chandrachud Explains Reason for Delay in Vacating Government Bungalow
  • ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయడంలో జాప్యంపై స్పందించిన మాజీ సీజేఐ
  • ప్రత్యేక అవసరాలున్న ఇద్దరు కుమార్తెలే కారణమన్న జస్టిస్ చంద్రచూడ్
  • కూతుళ్లు అరుదైన 'నెమలిన్ మయోపతీ' వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడి
  • వారికి అనువైన ఇల్లు దొరకడం కష్టంగా మారిందని ఆవేదన
  • ఇంట్లోనే ఐసీయూ లాంటి వసతులు అవసరమని వివరణ
తాను పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అధికారిక నివాసాన్ని ఎందుకు ఖాళీ చేయలేదో మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంగా వెల్లడించారు. సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, తన ఇద్దరు దత్త పుత్రికల ప్రత్యేక ఆరోగ్య అవసరాలే ఈ జాప్యానికి అసలు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా బాధ్యతల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని, ప్రభుత్వ బంగ్లాను అట్టిపెట్టుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.

తన పెంపుడు కుమార్తెలు ప్రియాంక, మహి.. 'నెమలిన్ మయోపతీ' అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారని జస్టిస్ చంద్రచూడ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వ్యాధి కారణంగా కండరాలు తీవ్రంగా బలహీనపడి, శ్వాస తీసుకోవడం, మింగడం వంటి కీలక ప్రక్రియలు దెబ్బతింటాయని వివరించారు. ఈ వ్యాధికి ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదని, పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. వారి బాగోగులే తమ కుటుంబానికి ప్రపంచమని, తన భార్య కల్పన దాస్ వారి సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తారని అన్నారు.

కుమార్తె ప్రియాంకకు 2021 నుంచి శ్వాస సంబంధిత సహాయం అవసరమని, అందుకే ఇంట్లోనే ఒక ఐసీయూ తరహా వాతావరణం ఏర్పాటు చేశామని చంద్రచూడ్ తెలిపారు. ప్రస్తుతం తాము ఉంటున్న అధికారిక నివాసాన్ని వారి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకున్నామని, బాత్రూమ్‌లతో సహా అన్ని సౌకర్యాలు వారికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం కేటాయించిన తాత్కాలిక వసతి గృహం గత రెండేళ్లుగా నిరుపయోగంగా ఉందని, ప్రస్తుతం అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయని, అది సిద్ధమైన వెంటనే ఖాళీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

గతంలోనూ ఇతర మాజీ ప్రధాన న్యాయమూర్తులకు వ్యక్తిగత కారణాలతో అధికారిక నివాసంలో ఉండేందుకు గడువు పొడిగించారని ఈ సంద‌ర్భంగా జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేశారు. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎన్వీ రమణలకు కూడా పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం ఇతర బంగ్లాలను కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. తన వస్తువులన్నీ ఇప్పటికే సర్దుకున్నానని, ఇల్లు సిద్ధమవ్వగానే మారిపోతానని ఆయన తెలిపారు.
DY Chandrachud
Chandrachud
CJI
Chief Justice of India
Nemaline Myopathy
Priyanka Chandrachud
daughter's health
government bungalow
official residence
Kalpana Das

More Telugu News