Chittoor: ఆస్తి కోసం అబద్ధాల పెళ్లి.. బెంగళూరు మహిళను నిండా ముంచిన చిత్తూరు వ్యక్తి

Chittoor man marries for property defrauds Bangalore woman Nagamani
  • భార్యాపిల్లలు కరోనాతో చనిపోయారని నమ్మించి వితంతువును పెళ్లాడిన వ్యక్తి
  • బెంగళూరుకు చెందిన మహిళ నుంచి రూ. 28 కోట్ల ఆస్తి కాజేసిన వైనం
  • నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో భూములు, భవనం విక్రయం
  • నిందితుడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వాసి శివప్రసాద్‌గా గుర్తింపు
  • మోసం గ్రహించి చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఆస్తిని కాజేయాలనే దురుద్దేశంతో ఓ వ్యక్తి తన భార్యాపిల్లలు బతికుండగానే కరోనాతో చనిపోయారని నమ్మించి, ఓ సంపన్న వితంతువును వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెకు చెందిన సుమారు రూ. 28 కోట్ల విలువైన ఆస్తిని అపహరించి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సోమవారం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం... చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన నాగమణి (50) బెంగళూరులో స్థిరపడ్డారు. ఆమెకు గతంలో వెంకటప్పరెడ్డితో వివాహం కాగా, రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అనారోగ్యంతో భర్త కూడా కన్నుమూశారు. ఒంటరిగా మారిన ఆమె, మరో వివాహం చేసుకోవాలని భావించి ఓ మధ్యవర్తిని సంప్రదించారు. ఈ విషయం తెలిసిన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్, నాగమణి ఆస్తిపై కన్నేశాడు.

అప్పటికే వివాహమై భార్య, కుమార్తె ఉన్న శివప్రసాద్, వారు కొవిడ్‌తో మరణించారని నకిలీ మరణ ధ్రువపత్రాలు సృష్టించాడు. ఆ పత్రాలను చూపించి నాగమణిని నమ్మించి 2022లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్‌బీఐ నుంచి భారీగా నిధులు రానున్నాయని, వాటిని క్లియర్ చేయడానికి కొంత డబ్బు చెల్లించాలని నకిలీ పత్రాలు చూపించాడు. భర్త మాటలు నమ్మిన ఆమె, అతను చెప్పిన ఖాతాలకు డబ్బు బదిలీ చేసింది. ఇదే అదనుగా శివప్రసాద్, నాగమణి సంతకాలను ఫోర్జరీ చేసి బెంగళూరులోని రూ. 15 కోట్ల విలువైన భూమిని, రూ. 10 కోట్ల విలువైన భవనాన్ని విక్రయించాడు. ఆమె బంగారు ఆభరణాలను కూడా బ్యాంకులో తాకట్టు పెట్టాడు.

ఓ శుభకార్యానికి వెళ్లేందుకు నగలు కావాలని నాగమణి అడగడంతో శివప్రసాద్ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. అనుమానం వచ్చి అతడి కోసం బంగారుపాళ్యం వెళ్లిన ఆమెకు, అతడికి అప్పటికే భార్య, కూతురు ఉన్నారన్న నిజం తెలిసి షాక్‌కు గురైంది. తాను మోసపోయానని గ్రహించి, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Chittoor
Nagamani
fraud marriage
property dispute
Karnataka
Bangalore
Sivaprasad
financial fraud
fake death certificate
real estate fraud

More Telugu News