Ramadevi: తల్లికి వందనం డబ్బుతో మద్యం తాగాడని... భర్తను హత్య చేసిన భార్య

Ramadevi Arrested for Husbands Murder in Andhra Pradesh
  • ప్రభుత్వం మంజూరు చేసిన తల్లికి వందనం డబ్బును మద్యం కోసం ఖర్చుచేసిన భర్త చంద్రశేఖర్
  • ఆగ్రహంతో మద్యంలో విషం కలిపి, ఆపై గొంతు నులుమి హత్య చేసిన భార్య రమాదేవి
  • అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లె గ్రామంలో ఘటన
అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లె గ్రామంలో భార్య తన భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తల్లికి వందన పథకం కింద ఇచ్చిన డబ్బుతో భర్త మద్యం సేవించాడనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ కేసులో నిందితురాలు రమాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లె డీఎస్పీ మహేంద్ర కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

భవన నిర్మాణ కార్మికుడు వంకోళ్ల చంద్రశేఖర్ (46)కు 20 ఏళ్ల క్రితం రమాదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్ మద్యంకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో రమాదేవికి పాలెంకొండకు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఇటీవల పిల్లలిద్దరికీ తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు రమాదేవి ఖాతాలో జమ అయింది. ఆ డబ్బును చంద్రశేఖర్ ఏటీఎం ద్వారా తీసుకున్నాడు. డబ్బు విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో చంద్రశేఖర్‌ను చంపాలని రమాదేవి నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 2వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో చంద్రశేఖర్ మద్యం ఇవ్వమని రమాదేవిని కోరాడు.

దీంతో రమాదేవి ఇదే అదునుగా భావించి మద్యం గ్లాసులో విషం కలిపి ఇచ్చింది. ఆ తర్వాత గొంతు నులిమి, కర్రతో కొట్టింది. దాంతో చంద్రశేఖర్ కిందపడిపోయాడు. విషం ప్రభావంతో వేకువజామున రక్తం కక్కుకుని చనిపోయాడు. ఉదయం లేచిన రమాదేవి వెంటనే రక్తపు మరకలను శుభ్రం చేసి, కూలీ పనికి వెళ్లిపోయింది.

మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రమాదేవి భర్త మద్యం తాగి చనిపోయాడని చుట్టుపక్కల వారికి చెప్పింది. అయితే, చంద్రశేఖర్ శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదికలో చంద్రశేఖర్ గొంతు నులమడం, విషం కలపడం వల్ల మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు రమాదేవిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
Ramadevi
Annamayya district
thaliki vandanam scheme
husband murder
Andhra Pradesh crime
marital affair
poisoning
Reddyganipalle
domestic violence
crime news

More Telugu News