Raipur Incident: యువతులపై పోకిరీల దాడి.. అమ్మాయి వేలు కొరికేసిన దుండగుడు.. వీడియో ఇదిగో!

Raipur Incident Girls Attacked After Birthday Party in Chhattisgarh
  • రాయ్‌పూర్‌లో యువతులకు వేధింపులు
  • పుట్టినరోజు పార్టీ నుంచి తిరిగొస్తుండగా ఘటన
  • సోషల్ మీడియాలో దాడి దృశ్యాలు వైరల్
  • బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
పుట్టినరోజు వేడుక ముగించుకుని ఇంటికి బయలుదేరిన యువతులపై కొందరు యువకులు అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బిలాస్‌పూర్, కోర్బా ప్రాంతాలకు చెందిన కొందరు యువతులు గురువారం రాత్రి రాయ్‌పూర్‌లోని మహాదేవ్ ఘాట్ సమీపంలో జరిగిన ఓ పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఇంటికి తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో కొందరు యువకులు వారిని అడ్డగించి, వేధించడం మొదలుపెట్టారు. చూస్తుండగానే ఈ వేధింపులు తీవ్రరూపం దాల్చాయి. దుండగులు యువతులపై దాడికి దిగారు. దాడిలో ఓ దుండగుడు ఒక యువతి వేలును కొరికేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యువకులు అమ్మాయిలపై దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాధిత అమ్మాయిలు తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, దుండగులు వెనక్కి తగ్గలేదు. ఒక యువకుడు ఓ అమ్మాయిని వేధిస్తుండగా, ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించింది. కొద్దిసేపటికే మరికొందరు యువకులు అక్కడకు చేరుకుని, మిగిలిన అమ్మాయిలపై కూడా దాడి ప్రారంభించారు.

మరొక యువకుడు ఓ అమ్మాయిని బలవంతంగా లాగడంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత మరో ఇద్దరు యువకులు వచ్చి ఆమెను నేలపై మరింత దూరం ఈడ్చుకెళ్లినట్లు వీడియోలో రికార్డయింది. ఇంకో యువకుడు ఓ అమ్మాయి జుట్టు పట్టుకుని లాగుతుండగా, ఆమె విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి.

ఈ ఘటనపై రాయ్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఉమేద్ సింగ్ స్పందించారు. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా పోలీసులు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించినట్టు చెప్పారు. దాడికి పాల్పడిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని, యువకులపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.  
Raipur Incident
Chhattisgarh Crime
Youth Attack
Girls Assault
Mahadev Ghat
Bilaspur
Korba
Umed Singh SP Raipur

More Telugu News