Alappuzha Gymkhana: ఓటీటీలోకి మలయాళ స్పోర్ట్స్ డ్రామా

- మలయాళ స్పోర్ట్స్ డ్రామా మూవీ అలప్పుజ జింఖానా
- ఓటీటీలో విడుదలపై అధికారిక ప్రకటన
- సోనీలివ్ ఓటీటీలో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్
- మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో
మలయాళ క్రీడా నేపథ్య చిత్రం ‘అలప్పుజ జింఖానా’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపించగా, తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీలో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్, లక్ష్మణ్ అవరన్, సందీప్ ప్రదీప్, అనఘ రవి తదితరులు ప్రధాన పాత్రల్లో ఖలీద్ రెహమాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
బాక్సింగ్ ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రం మలయాళంలో ఏప్రిల్ 10న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అనంతరం ఏప్రిల్ 25న తెలుగులో విడుదలై ప్రేక్షకులను అలరించింది. కథలోని హాస్యాన్ని, గందరగోళాన్ని సమతూకంగా చూపిస్తూ రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.
కథ విషయానికి వస్తే.. అలప్పుజకు చెందిన కొంతమంది యువకులు జోజో జాన్సన్ (నస్లేన్), డీజే జాన్ (బేబీ జీన్), షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్), షణవాస్ (శివ హరిచరణ్), దీపక్ ఫణిక్కర్ (గణపతి) స్నేహితులు. వీరిలో షణవాస్ మినహా మిగిలిన వారంతా పరీక్షల్లో ఫెయిల్ కావడంతో డిగ్రీలో చేరే అవకాశం కోల్పోతారు.
క్రీడా కోటా ద్వారా అడ్మిషన్ సాధించేందుకు బాక్సింగ్ నేర్చుకోవాలని అనుకుంటారు. అందుకోసం అలప్పుజ జింఖానా అకాడమీలో బాక్సింగ్ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. అక్కడ అంటోనీ జోషువా (లక్కన్ అవరన్) వారికి కోచ్‌గా వ్యవహరిస్తాడు. అతని శిక్షణలో స్థానిక బాక్సింగ్ పోటీల్లో గెలిచిన జోజో జాన్సన్ బృందం, ఆ తర్వాత కేరళ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమవుతుంది.
అయితే, ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లతో పోటీ పడే ఆ బాక్సింగ్ పోటీల్లో ఈ యువకులకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? ఆ ప్రయాణంలో వాళ్లు ఏమి నేర్చుకున్నారు? రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో గెలిచారా? అన్నది మిగతా కథ.