Virat Kohli: న‌న్ను 18 ఏళ్లు వెయిట్ చేయించావు మై ఫ్రెండ్... ట్రోఫీ గెలిచిన త‌ర్వాత కోహ్లీ తొలి పోస్ట్‌

Virat Kohlis First Post After RCB IPL Trophy Win
  • ఐపీఎల్ 2025 టైటిల్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • 18 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు దక్కిన విజయం
  • ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఉత్కంఠభరిత పోరులో గెలుపు
  • ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ
  • నీకోసం 18 ఏళ్లు ఎదురుచూశా ఫ్రెండ్ అంటూ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)ను ఓడించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ట్రోఫీని ముద్దాడి, అభిమానుల గుండెల్లో ఆనందం నింపింది. ఎన్నో సీజన్లుగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ అభిమానుల ఆశలు ఈ విజయంతో ఫలించాయి.

గతంలో మూడుసార్లు (2009, 2012, 2016) ఫైనల్స్‌కు చేరినా, టైటిల్ గెలవడంలో విఫలమైన ఆర్సీబీ, ఈసారి మాత్రం పట్టుదలగా ఆడి విజయాన్ని అందుకుంది. ఈ కీలక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ బౌలర్లకు గట్టి సవాల్ విసిరింది. నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోరును సాధించింది. జట్టు స్కోరులో విరాట్ కోహ్లీ (35 బంతుల్లో 43 పరుగులు), రజత్ పాటిదార్ (16 బంతుల్లో 26 పరుగులు), జితేశ్‌ శర్మ (10 బంతుల్లో 24 పరుగులు) కీలక పాత్ర పోషించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించి, పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేసి చారిత్రక విజయాన్ని జట్టు ఖాతాలో వేశారు.

దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్, ఆర్సీబీ అభిమానులకు చిరస్మరణీయంగా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. విజయం అనంతరం ఆటగాళ్లు, అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. 

ఈ విజయంపై కింగ్ కోహ్లీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించాడు. త‌న‌ సంతోషాన్ని పంచుకుంటూ... "ఈ జట్టు కలను సాకారం చేసింది. ఈ సీజన్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. గత రెండున్నర నెలలుగా ఈ ప్రయాణాన్ని మేం పూర్తిగా ఆస్వాదించాం. కష్టకాలంలో కూడా మమ్మల్ని వీడని ఆర్సీబీ అభిమానులకు ఈ విజయం అంకితం. ఎన్నో ఏళ్ల నిరాశ, నిస్పృహలకు ఇది సమాధానం. ఈ జట్టు కోసం మైదానంలో పడిన ప్రతీ కష్టానికి ఇది ప్రతిఫలం. ఐపీఎల్ ట్రోఫీ.. నిన్ను ముద్దాడ‌టం కోసం న‌న్ను 18 ఏళ్లు వెయిట్ చేయించావు మై ఫ్రెండ్‌. కానీ, ఆ ఎదురుచూపులు నిజంగా విలువైన‌వే అని నిజం చేశావ్‌" అని కోహ్లీ త‌న ఇన్‌స్టా స్టోరీలో ఎమోష‌న‌ల్‌గా రాసుకొచ్చాడు. దీనికి ట్రోఫీతో ఆర్‌సీబీ జ‌ట్టు సంబ‌రాల ఫొటోలను జోడించాడు. 

ఈ విజయంతో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఎనిమిదో జట్టుగా ఆర్సీబీ క్రికెట్ చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. అచంచలమైన విశ్వాసం, అంతులేని మద్దతు అందించిన అభిమానులకు ఈ విజయం ఒక మధురానుభూతిని మిగిల్చింది.
Virat Kohli
RCB
Royal Challengers Bangalore
IPL Trophy
IPL Win
Punjab Kings
RCB Victory
Cricket
Indian Premier League
Narendra Modi Stadium

More Telugu News