Vangalapudi Anitha: గంజాయి బ్యాచ్ ఇంటికి జగన్ వెళుతున్నారు: అనిత

Anitha Criticizes Jagan for Politicizing Tenali Incident
  • తెనాలి ఘటనకు రాజకీయ రంగు పులుముతున్నారన్న అనిత
  • రాజకీయ లబ్ధి కోసం జగన్ యత్నిస్తున్నారని మండిపాటు
  • పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించవద్దని సూచన
రాజకీయ ప్రయోజనాల కోసం తెనాలి ఘటనకు కులం, మతం రంగు పులుముతున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. విజయవాడ సత్యనారాయణపురం మోడల్ పోలీస్ స్టేషన్‌ను డీజీపీతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు..

తెనాలి ఘటనకు సంబంధించిన యువకులపై పలు కేసులు ఉన్నాయని, పోలీసులపైనే వారు చేయి చేసుకున్నారని డీజీపీ వెల్లడించారని అనిత గుర్తు చేశారు. అలాంటి గంజాయి బ్యాచ్ ఇంటికి వైసీపీ అధినేత జగన్ వెళుతున్నారని... ఇది కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి, కులమతాలను రెచ్చగొట్టడానికేనని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే, తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ సమర్థించుకున్నారని గుర్తుచేశారు.

వైసీపీ హయాంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై కొట్టినా, రాజమండ్రిలో ఇసుక మాఫియాపై మాట్లాడిన వరప్రసాద్‌కు పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేసినా ఆనాడు జగన్ ఎందుకు స్పందించలేదని, వారి ఇళ్లకు వెళ్లి ఎందుకు పరామర్శించలేదని అనిత నిలదీశారు. పులివెందులలో మహిళ హత్యకు గురైనప్పుడు తాము వెళితే కేసు పెట్టారని అన్నారు. తమ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని, పోలీసులను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని ఆమె స్పష్టం చేశారు. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించవద్దని సూచించారు.
Vangalapudi Anitha
Tenali incident
Jagan Mohan Reddy
YCP
TDP
Andhra Pradesh politics
Home Minister Andhra Pradesh
Ganja batch
Vijayawada
Law and order

More Telugu News