Pankhuri Mishra: మొన్న చెప్పుతో కొట్టింది.. ఈ రోజు కాళ్లు పట్టుకుంది.. వీడియో ఇదిగో!

- బెంగళూరులో ఆటో డ్రైవర్‌పై మహిళ దాడి
- వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు
- ఆటో డ్రైవర్ ఫిర్యాదుతో మహిళ అరెస్ట్.. స్టేషన్ బెయిల్ పై విడుదల
- గర్భవతినంటూ కన్నీటితో క్షమాపణ చెప్పిన మహిళ
కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ ను మహిళ చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆటోను తన పాదం పైనుంచి నడిపాడని పంఖూరి మిశ్రా అనే మహిళ ఆరోపించింది. దీంతో ఆటో డ్రైవర్ ను హిందీలో దూషించింది. ఇదంతా ఫోన్ లో రికార్డు చేస్తున్నాడని ఆటో డ్రైవర్ ను చెప్పుతో కొట్టింది. ఈ వీడియోను ఆటో డ్రైవర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. బెంగళూరు పోలీసులు స్పందించి ఆటో డ్రైవర్ ఫిర్యాదుతో మిశ్రాను అరెస్టు చేశారు. శనివారం ఈ ఘటన జరగగా ఆదివారం మిశ్రాను అరెస్టు చేశారు. ఆపై స్టేషన్ బెయిల్ మీద విడుదల చేశారు. తాజాగా సోమవారం మిశ్రా తన భర్తతో కలిసి ఆటో డ్రైవర్ కాళ్లు మొక్కుతూ క్షమించమని వేడుకుంది.
అసలేం జరిగిందంటే..
శనివారం పంఖూరి మిశ్రా తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఓ ఆటో వారికి డాష్ ఇచ్చింది. ఆటో చక్రం తన పాదంపై నుంచి వెళ్లిందని ఆరోపిస్తూ మిశ్రా ఆటో డ్రైవర్ తో వాదనకు దిగింది. ఆమె హిందీలో మాట్లాడుతుండడంతో ఆటో డ్రైవర్ లోకేశ్ తన ఫోన్ లో రికార్డు చేశాడు. దీంతో ఆగ్రహించిన మిశ్రా.. లోకేశ్ పై చెప్పుతో దాడి చేశారు. "వీడియో తీస్తావా? తీసుకో" అంటూ హిందీలో మాట్లాడుతూ ఆమె పలుమార్లు డ్రైవర్ లోకేశ్ ను కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ, డ్రైవర్ తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో ఆమె భర్త ద్విచక్ర వాహనంపైనే కూర్చుని ఘటనను రికార్డ్ చేయడం గమనార్హం.
అయితే, మిశ్రా ఆరోపణలను ఆటో డ్రైవర్ లోకేశ్ ఖండించాడు. ఈ ఘటనలో తన తప్పేమీలేదని, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఎవరిది తప్పో తెలుస్తుందని ఆయన అన్నారు. మిశ్రా హిందీలో మాట్లాడడంతో ఆమె భాష తనకు అర్థం కాక వీడియో తీశానని వివరణ ఇచ్చాడు. కాగా, స్టేషన్ బెయిల్ పై విడుదలైన తర్వాత మిశ్రా దంపతులు లోకేశ్ దంపతులను కలిసి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పారు. "క్షమించండి. నేను గర్భవతిని. ఒకవేళ గర్భస్రావం అవుతుందేమోననే భయం వల్లే అలా ప్రవర్తించాను" అని మిశ్రా అన్నారు.