Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

Telangana Formation Day Wishes from President and PM

  • నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
  • ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
  • ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజ‌ల‌కు ప‌లువురు ప్రముఖుల శుభాకాంక్ష‌లు

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. 2014 జూన్ 2న‌ తెలంగాణ ఏర్పడిన విష‌యం తెలిసిందే. దీంతో నేటితో రాష్ట్రం ఏర్ప‌డి 11 యేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా తెలంగాణ ప్రజ‌ల‌కు ప‌లువురు ప్రముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు.

ఇప్ప‌టికే ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం విషెస్ తెలియ‌జేస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా పోస్టు పెట్టారు. 

"రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు! ఈ యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధి తాలూకు శక్తివంతమైన ఆధునిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతి, శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను" అని రాష్ట్ర‌ప‌తి ట్వీట్ చేశారు. 

మరోవైపు దేశ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల మెరుగైన జీవన సౌలభ్యానికి కేంద్రం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.

"తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. జాతీయ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో రాష్ట్ర ప్రజల 'జీవన సౌలభ్యాన్ని' పెంచడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలను ఆ దేవుడు విజయం, శ్రేయస్సును ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నాను" అని మోదీ ట్వీట్ చేశారు.  

Telangana Formation Day
Droupadi Murmu
Narendra Modi
Telangana
Revanth Reddy
KCR
Chandrababu Naidu
Pawan Kalyan
State Formation Day Wishes
  • Loading...

More Telugu News