Indus Waters Treaty: సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్.. ఎండుతున్న పాక్ డ్యామ్ లు

Pakistan Faces Water Shortage as India Halts Indus Waters Treaty
  • రెండు కీలక డ్యామ్‌లలో సగానికి పడిపోయిన నీటి నిల్వలు
  • సాగునీటి సంక్షోభం, ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం పడనుందని ఆందోళన
  • భారత్ చర్య ఏకపక్షమని, చట్టవిరుద్ధమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విమర్శ
  • ఉగ్రవాదంతో పాకిస్థానే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత్ గట్టి బదులు
పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ తో గతంలో జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం ప్రస్తుతం ప్రభావం చూపిస్తోంది. సింధు జలాలను నిలిపివేయడంతో పాకిస్థాన్ లో నీటి కరవు ఏర్పడింది. ఇది పాకిస్థాన్ లో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పాకిస్థాన్‌లోని కీలకమైన మంగ్లా (జీలం నదిపై), తర్బేలా (సింధు నదిపై) డ్యామ్‌లలో నీటి నిల్వలు గణనీయంగా పడిపోవడంతో ఖరీఫ్ (వేసవి పంటల) సాగు ప్రమాదంలో పడింది. ఈ రెండు డ్యామ్‌లు పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌లలో వ్యవసాయానికి, జలవిద్యుత్ ఉత్పత్తికి అత్యంత కీలకం. ప్రస్తుత నీటి కొరత ఈ నెలలో ఖరీఫ్ సాగు ప్రారంభమయ్యే నాటికి మరింత తీవ్రరూపం దాల్చవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిణామాలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన హిమానీనదాల పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, సింధు నదీ బేసిన్ నీటి పంపకాన్ని నియంత్రించే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా నిలిపివేసిందని ఆరోపించారు. సింధు నదీ వ్యవస్థ అథారిటీ (ఐఆర్‌ఎస్‌ఏ) తాజా అంచనాల ప్రకారం, పాకిస్థాన్ మొత్తం నీటి ప్రవాహంలో 21% కొరతను, రెండు కీలక డ్యామ్‌లలో దాదాపు 50% నీటి నిల్వల కొరతను ఎదుర్కొంటోంది. భారత్ నుంచి చీనాబ్ నది ప్రవాహాలు అకస్మాత్తుగా తగ్గడం వల్ల ఖరీఫ్ సీజన్ ఆరంభంలో నీటి కొరత మరింత పెరుగుతుందని ఐఆర్‌ఎస్‌ఏ ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే, సింధు జలాల ఒప్పందం ఉల్లంఘనకు తమను నిందించడం మానుకోవాలని భారత్ పాకిస్థాన్‌కు స్పష్టం చేసింది. తజికిస్థాన్‌లోని దుషాన్‌బేలో జరిగిన ఐక్యరాజ్యసమితి హిమానీనదాల సదస్సులో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ.. పాకిస్థానే ఉగ్రవాదం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు. "ఈ వేదికను దుర్వినియోగం చేసి, సంబంధం లేని అంశాలను ప్రస్తావించడానికి పాకిస్థాన్ చేసిన ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము" అని ఆయన వ్యాఖ్యానించారు.
Indus Waters Treaty
Pakistan water crisis
Shehbaz Sharif
Mangla Dam
Tarbela Dam
Kharif crops
Chenab River
India Pakistan relations
Water scarcity
Kirti Vardhan Singh

More Telugu News