Andhra Pradesh Government: రైతులకు, కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP Govt Announces Good News for Farmers  Tenant Farmers
  • అన్నదాత సుఖీభవ' పథకం కౌలు రైతులకు విస్తరణ
  • ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సాయం
  • మూడు విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కు లేకున్నా, ఇతరుల భూములను కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్న కౌలు రైతులకు కూడా ఆర్థిక భరోసా కల్పించాలని సంకల్పించింది. ఇప్పటికే అమలులో ఉన్న 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని కౌలు రైతులకు సైతం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 20,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.

ఈ మొత్తాన్ని మూడు విడతలుగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందించే రూ. 6 వేలతో కలిపి ఈ మొత్తం రూ. 20,000 అందజేయనున్నారు. ఈ పథకం కింద అటవీ భూములపై హక్కు పత్రాలు (ఆర్ఓఎఫ్ఆర్) కలిగిన రైతులను కూడా అర్హులుగా గుర్తించనున్నారు.

ఈ పథకం అమలు కోసం క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల సహాయకులు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని సూచించింది. ఇలా ధ్రువీకరించిన జాబితాలను మే 20వ తేదీలోగా 'అన్నదాత సుఖీభవ' అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది.

ఈ పథకం అమలులో కుటుంబాన్ని (భర్త, భార్య, మైనర్ పిల్లలు) ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. కుటుంబంలోని పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్‌గా గుర్తిస్తారు. వ్యవసాయం, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమకు సంబంధించిన పంటలు సాగు చేసే వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

అయితే, ఈ పథకానికి కొన్ని వర్గాలను మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు, గతంలో లేదా ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు వంటి వృత్తి నిపుణులు, గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వారు ఈ పథకానికి అర్హులు కారని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 
Andhra Pradesh Government
Annadata Sukhibhava
AP Farmer Scheme
Rythu Bharosa
Koul Rythulu
Financial Assistance
Agriculture
PM Kisan
ROFR
Farming

More Telugu News