Pradeep Bhandari: యుద్ధం వస్తే దేశం విడిచి పారిపోయేందుకు పాక్ నేతలు రెడీగా ఉన్నారు: బీజేపీ నేత వ్యాఖ్యలు

Pakistani Leaders Ready to Flee if War Breaks Out BJP Leader
  • పహల్గామ్ దాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు
  • పాక్ మంత్రులు, ఆర్మీ జనరల్స్ ఇంగ్లండ్ కు టికెట్లు బుక్ చేసుకున్నారన్న భండారీ 
  • మోదీ నిర్ణయంపై పాక్ నాయకత్వంలో భయం నెలకొందని వ్యాఖ్య
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మంత్రులు, ఆ దేశ ఆర్మీ జనరల్స్ భయంతో దేశం విడిచి పారిపోయేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

పహల్గామ్ దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారోనన్న భయాందోళనలు పాకిస్థాన్ నాయకత్వంలో వ్యక్తమవుతున్నాయని ప్రదీప్ భండారీ అన్నారు. ఈ భయంతోనే పలువురు పాక్ మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు తమ కుటుంబాలతో సహా ఇంగ్లాండ్ వంటి విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన వివరించారు. "యుద్ధం వస్తే తాము ఇంగ్లాండ్ వెళతామని కొందరు పాక్ నేతలు ఇప్పటికే చెబుతున్నారు" అని భండారీ పేర్కొన్నారు.

పాకిస్తాన్ సైన్యంపై గానీ, వారి రక్షణ సామర్థ్యంపైన గానీ ఆ దేశ ప్రజలకే నమ్మకం లేదని భండారీ ఎద్దేవా చేశారు. అందుకే మంత్రులు, కీలక నేతలు ముందుజాగ్రత్తగా విదేశాలకు పయనమయ్యేందుకు టిక్కెట్లు సిద్ధం చేసుకున్నారని ఎత్తిపొడిచారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్... పాకిస్థాన్‌కు తగిన రీతిలో గట్టి సమాధానం ఇవ్వనుందని భండారీ తెలిపారు. ప్రపంచంలోని ప్రతీ దేశం, ప్రధాని మోడీ తీసుకోబోయే ఏ నిర్ణయానికైనా మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్ చర్యలకు పాకిస్థాన్ నాయకత్వం భయపడుతోందనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
Pradeep Bhandari
Pakistan
India
Pakistan-India relations
War
Political Crisis
BJP
Narendra Modi
International Relations
Terrorism

More Telugu News