Jagan Mohan Reddy: జగన్ హెలికాప్టర్ ఘటన... 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్

- గత నెల 9న పాపిరెడ్డిపల్లి వచ్చిన జగన్
- జగన్ హెలికాప్టర్ వద్దకు దూసుకువచ్చిన కార్యకర్తలు
- హెలికాప్టర్ ధ్వంసం!
- సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసుల వెల్లడి
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత నెల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న హెలికాప్టర్ ధ్వంసం ఘటనకు సంబంధించి 10 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒక స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులకు ధర్మవరం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఏప్రిల్ 8న శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన పార్టీకి చెందిన బీసీ నేత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పాపిరెడ్డిపల్లి గ్రామానికి హెలికాప్టర్‌లో వెళ్లారు. ఆ సమయంలో హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని కొందరు కార్యకర్తలు హెలికాప్టర్ వద్దకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో హెలికాప్టర్ విండ్‌షీల్డ్ (ముందు అద్దం) దెబ్బతిన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పరిణామంతో జగన్ తన పర్యటనను ముగించుకుని రోడ్డు మార్గంలో బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి మొత్తం 19 మందిని గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 10 మందిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్‌లకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపినట్లు వెల్లడించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, హెలికాప్టర్ పైలట్, కో-పైలట్‌లను ఏప్రిల్ 16న విచారణకు పిలిపించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి సురక్షితం కానప్పుడు తిరిగి ఎలా వెళ్లారని వారిని ప్రశ్నించినట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్ అద్దం నిజంగా పగిలిందా అనే దానిపై పోలీసులకు ముందు నుంచి కొన్ని సందేహాలున్నట్లు తెలిసింది.
వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు కేసులు: శివశంకర్ రెడ్డి
మరోవైపు, జెడ్-ప్లస్ కేటగిరి భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. వైసీపీ అధికార ప్రతినిధి పుట్టా శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడిపై తప్పుడు అభియోగాలతో కేసులు నమోదు చేశారని, వారి అనుచరులను విచక్షణారహితంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. "హెలికాప్టర్ దెబ్బతిని జగన్ రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చినప్పుడే పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడు జనాలను రెచ్చగొట్టారంటూ తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో ఆయన అనుచరులను అదుపులోకి తీసుకుంటున్నారు" అని శివ శంకర్ రెడ్డి అన్నారు.