Sher Afzal Khan Marwat: భారత్ మాపై యుద్దానికి వస్తే నేను ఇంగ్లండ్ వెళ్లిపోతా: పాక్ ఎంపీ వ్యాఖ్యలు

Pakistani MPs Controversial Remarks on India Pakistan War
  • పహల్గామ్ దాడి తర్వాత భారత్-పాక్ తీవ్ర ఉద్రిక్తతలు
  • భారత్‌తో యుద్ధం వస్తే ఇంగ్లాండ్ వెళ్తానన్న పాక్ ఎంపీ మార్వాత్
  • మోదీ తన మాట వినరంటూ వ్యంగ్య వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఎంపీ వీడియో ఇంటర్వ్యూ
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, పాకిస్తాన్‌కు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత్‌తో యుద్ధం వస్తే తాను తుపాకీ పట్టుకుని సరిహద్దుకు వెళ్లను, బదులుగా ఇంగ్లండ్ వెళ్లిపోతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇటీవల పహల్గామ్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ భావిస్తోంది. ప్రతీకారంగా ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నేతలు కొందరు యుద్ధ సంకేతాలు ఇస్తుండగా, ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఓ ఇంటర్వ్యూలో విలేకరి.. "ఒకవేళ భారత్‌తో యుద్ధం వస్తే మీరు తుపాకీ తీసుకుని సరిహద్దుకు వెళతారా?" అని ప్రశ్నించారు. దీనికి మార్వాత్ స్పందిస్తూ, "యుద్ధం మొదలైతే నేను ఇంగ్లండ్‌కు వెళతాను" అని సూటిగా సమాధానమిచ్చారు. అనంతరం, "ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత ప్రధాని మోదీ వెనక్కి తగ్గుతారని మీరు భావిస్తున్నారా?" అని విలేకరి అడగ్గా, మార్వాత్ మరింత వ్యంగ్యంగా బదులిచ్చారు. "నేను చెబితే వినడానికి మోదీ ఏమైనా నా అత్త కొడుకా?" అంటూ వ్యాఖ్యానించారు.

ఈ సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. పాకిస్తానీ రాజకీయ నాయకులకే వారి సైన్యంపై నమ్మకం లేదని కొందరు, ఇలాంటి నేతలుంటే దేశం పరిస్థితి ఏంటని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్... మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందినవారే. అయితే, పార్టీ నాయకత్వంపై, విధానాలపై పలుమార్లు బహిరంగంగా విమర్శలు చేయడంతో ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఆయన్ను పార్టీ నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


Sher Afzal Khan Marwat
Pakistan MP
India-Pakistan tensions
Pulwama attack
Imran Khan
Pakistan Tehreek-e-Insaf
Indo-Pak war
Viral Video
Social Media
England

More Telugu News