KKR: మ్యాచ్ అంటే ఇదీ... 1 పరుగు తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకున్న కేకేఆర్

KKR Wins by 1 Run Thriller Against RR in IPL 2025
  • రాజస్థాన్ పై కేకేఆర్ థ్రిల్లింగ్ విక్టరీ
  • కేకేఆర్ స్కోరు 20 ఓవర్లలో 206/4 
  • రాజస్థాన్ 20 ఓవర్లలో 205/8 
  • రియాన్ పరాగ్ (95) వీరోచిత పోరాటం వృథా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరో ఉత్కంఠ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ కేవలం ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ పోరులో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడి అభిమానులకు అసలైన టీ20 మజాను అందించాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం 207 పరుగుల కఠిన లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడినా, విజయం ముఖం చాటేసింది. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ (95 పరుగులు; 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేశాడు. దాదాపు మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశాడు. అతనికి యశస్వి జైస్వాల్ (34), షిమ్రోన్ హెట్‌మెయర్ (29), శుభమ్ దూబే (25 నాటౌట్) నుంచి కొంత సహకారం లభించినప్పటికీ, కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం రాజస్థాన్‌ను దెబ్బతీసింది. 

ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్వల్ప వ్యవధిలో ధ్రువ్ జురెల్ (0), వనిందు హసరంగ (0) వికెట్లను కోల్పోవడం ఛేదనపై ప్రభావం చూపింది. చివరి ఓవర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, కేకేఆర్ బౌలర్లు ఒత్తిడిని తట్టుకొని నిలబడ్డారు. చివరి బంతికి రాజస్థాన్ విజయానికి మూడు పరుగులు అవసరం కాగా, ఒక పరుగు మాత్రమే చేయగలిగారు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులకే పరిమితమైంది.

కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వైభవ్ అరోరా ఒక వికెట్ దక్కించుకోగా, సునీల్ నరైన్ (4 ఓవర్లలో 27 పరుగులు) పొదుపుగా బౌలింగ్ చేసి ఒత్తిడి పెంచాడు. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్ ఆశలను మరింత పటిష్టం చేసుకుంది.

టాస్ గెలిచిన లక్నో
ఇవాళ్టి రెండో  మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ధర్మశాల ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది.

KKR
IPL 2025
Kolkata Knight Riders
Rajasthan Royals
IPL Match
Cricket
Ryan Parag
Thriller Match
Eden Gardens
T20 Cricket

More Telugu News