Chiranjeevi: చాలామంది కష్టపడతారు... కానీ ఆ కష్టం సరైన దిశలో ఉందా అనేదే కీలకం: చిరంజీవి

Chiranjeevi on Success Hard Work and Right Direction
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరైన 'మైండ్‌సెట్ షిఫ్ట్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు డాక్టర్ శరణి ఈ పుస్తకం రచించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, జీవితంలో విజయం సాధించడానికి కష్టపడటంతో పాటు సరైన దృక్పథం కలిగి ఉండటం అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించిన మానసిక దృక్పథంలో మార్పు  అనే అంశం చాలా ముఖ్యమైనదని చిరంజీవి పేర్కొన్నారు. చాలామంది కష్టపడతారని, అయితే ఆ కష్టం సరైన దిశలో, స్మార్ట్‌గా ఉందా లేదా అన్నది ఫలితాన్ని నిర్ధారిస్తుందని వివరించారు.

సరైన అవగాహన, మార్గనిర్దేశం లేకపోవడం వల్ల చాలామంది ఒకే రకమైన గానుగెద్దు జీవితాన్ని గడుపుతారని చిరంజీవి అభిప్రాయపడ్డారు. శరణి వంటి వారు రాసే పుస్తకాలు, గురువుల మార్గదర్శకత్వం లేదా స్వీయ అవగాహన ద్వారా ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చని సూచించారు. తమకు ఇష్టమైన రంగంలో కృషి చేస్తే వచ్చే ఫలితాలు, ఎదిగే స్థాయి వేరుగా ఉంటుందని ఆయన అన్నారు.

వ్యక్తిత్వ వికాసం, సానుకూల దృక్పథం వంటి అంశాలపై తనకు ఎప్పటినుంచో ఆసక్తి ఉందని చిరంజీవి తెలిపారు. దశాబ్దాల క్రితం తాను 'ది సీక్రెట్' వంటి పుస్తకాల ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నానని, వాటిని ఆచరించడం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని గుర్తుచేసుకున్నారు. తన నేపథ్యం గురించి మాట్లాడుతూ, తాను సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, తల్లిదండ్రులకు కూడా తన భవిష్యత్తుపై మార్గనిర్దేశం చేసేంత అవగాహన లేని పరిస్థితుల్లో స్వయంకృషితో పైకి వచ్చానని పరోక్షంగా సూచించారు.

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన రచయిత్రి శరణి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మంత్రి నారాయణకు, గంటా శ్రీనివాసరావుకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న యువత, విద్యార్థులను చూసి దేశ భవిష్యత్తు వారి కళ్ళల్లో కనిపిస్తోందని అన్నారు.

Go Back to Shorts
Chiranjeevi
Mindset Shift
Book Launch
Chandrababu Naidu
Success
Positive Thinking
Personal Development
Smart Work
Dr. Sharani
Ponuguru Narayan
Ganta Srinivasa Rao

More Telugu News