2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల

Polavaram Project Completion by 2027 Minister Nimmala
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌కు సంబంధించి ఇప్పటి వరకు 202 మీటర్ల నిర్మాణం పూర్తయినట్లు ఏపీ జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాఫ్రం వాల్ జగన్ పాలనలో విధ్వంసానికి గురి కాగా, నేడు కూటమి ప్రభుత్వంలో నిర్మాణం దశగా పనులు సాగుతున్నాయన్నారు.

కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను రూ.990 కోట్లతో జనవరి 18న మొదలుపెట్టామని తెలిపారు. రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో డయాఫ్రం వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 30 కల్లా మూడవ కట్టర్ కూడా అందుబాటులోకి రానుందని చెప్పారు. వర్షాకాలంలో సైతం పనులు జరిగేలా, ఎగువ కాపర్ డ్యామును బలోపేతం చేయడానికి బట్రస్ డ్యాం మే నెలకల్లా పూర్తి చేస్తామని తెలిపారు.

చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రం వాల్ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, సమాంతరంగా గ్యాప్-1 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాన్ని ఏప్రిల్ నెలలో మొదలుపెట్టామని మంత్రి తెలిపారు. గ్యాప్-2 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ఈ ఏడాది నవంబర్ 30లోగా మొదలు పెట్టేలా చంద్రబాబు ప్రణాళికలను అమలు చేస్తామని, వచ్చే 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా పనులు మరింత వేగవంతం చేస్తామన్నారు.

చంద్రబాబు ఇటీవల జరిపిన సమీక్షలో 2027లో గోదావరి పుష్కరాలు ఉన్నందున ఆ ఏడాది జూన్ కల్లా పూర్తయ్యేలా చూడాలని చెప్పారని, సాధ్యమైనంత వరకు అప్పటికి పూర్తయ్యేందుకు పనులను వేగవంతం చేస్తామని, లేనియెడల అనుకున్న లక్ష్యానికి కచ్చితంగా పూర్తి చేస్తామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో లెఫ్ట్ కెనాల్‌కు అర బస్తా సిమెంట్ గాని, రూపాయి పని గాని నోచుకోలేదన్నారు.

కూటమి ప్రభుత్వం రూ.1200 కోట్లతో టెండర్లు పిలవడంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. గోదావరి వరద జలాలు లెఫ్ట్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు తరలిస్తామని, తద్వారా ఉత్తరాంధ్రకు సాగు, తాగు నీరు అందుతుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేశ్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. 
Go Back to Shorts
Nimmala Ramanaidu
Polavaram Project
Diaphragm Wall
Andhra Pradesh
Chandrababu Naidu
Irrigation Project
Godavari River
Left Canal

More Telugu News