ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారికి ఉపాధి కార్యక్రమం: భట్టి విక్రమార్క
- ఉద్యోగాలు వస్తాయనే యువత ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిందని వ్యాఖ్య
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 53 వేల మందికి నియామక పత్రాలు అందించామన్న భట్టి విక్రమార్క
- రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామన్న ఉప ముఖ్యమంత్రి
ప్రాజెక్టులలో భూమిని కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వ నేతలు చెప్పారని, కానీ భూనిర్వాసితులు వృద్ధులైపోయినా ఉద్యోగాలు రాలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం వెంటనే ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారి కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం కోసం రూ. 9 వేల కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన కంపెనీలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదర్చుకుంటున్నామని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ సూచన మేరకు నేదురమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారని, నేడు ఐటీ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీలో మరిన్ని కంపెనీలు ఏర్పాటయ్యేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను విస్తరిస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయని, దాని ద్వారా ఉపాధి కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.