కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు... ఉపసంహరించుకున్నాం: న్యాయవాది

KTR lawyer on quash petition
  • లీగల్ టీమ్ ఒపీనియన్ ప్రకారం కేసును ఉపసంహరించుకున్నామన్న మోహిత్ రావు
  • కేటీఆర్‌పై రాజకీయ కక్షతో బూటకపు కేసు పెట్టారన్న సోమా భరత్
  • క్వాష్ పిటిషన్ కొట్టి వేయడం వేరు.. ఉపసంహరించుకోవడం వేరన్న సోమా భరత్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో డిస్మిస్ కాలేదని ఆయన తరఫు అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు. తమ లీగల్ టీమ్ ఒపీనియన్ ప్రకారం కేసును ఉపసంహరించుకున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులో అయినా అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నవి ప్రొసీజర్‌లోని ఇర్రెగ్యులార్టీకి సంబంధించిన అంశాలు అన్నారు. ఈ కేసులో సెక్షన్13.1ఏ సీపీ యాక్ట్ వర్తించదని కోర్టుకు తెలిపామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 9 నగరాల్లోనే ఫార్ములా ఈ-రేస్ జరుగుతోందని న్యాయవాది, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమా భరత్ అన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు దీనిని రప్పించారని తెలిపారు. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచేందుకే దీనిని నిర్వహించినట్లు చెప్పారు. కేటీఆర్‌పై రాజకీయ కక్షతో బూటకపు కేసు పెట్టారని మండిపడ్డారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని కేటీఆర్ ఎప్పుడూ చెబుతుంటారన్నారు. ఈ కేసులో అక్రమాలకు ఆధారాలు లేవని కోర్టు విశ్వసించిందన్నారు. 

క్వాష్ పిటిషన్‌ను కొట్టి వేయడం వేరు... ఉపసంహరించుకోవడం వేరు అని అన్నారు. అబ‌ద్దాలు, అస‌త్యాల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు అప్పీల్‌ను ఉపసంహరించుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుప్రీంకోర్టు చెప్పినందుకే కేటీఆర్ క్వాష్ పిటిష‌న్ ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తాన‌ని కేటీఆర్ చెప్పారని సోమా భరత్ తెలిపారు.

కాగా, ఫార్ములా ఈ-కార్ రేసు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లేతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు.
Go Back to Shorts
KTR
Telangana
BRS
Congress

More Telugu News