రూ. 13 లక్షలు పెట్టి సినిమా తీస్తే.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది!
- 2007లో ఓరెన్ పెలి దర్శకత్వంలో రూపొందిన ‘పారానార్మల్ యాక్టివిటీ’
- పారితోషికం ఖర్చులు తగ్గించుకునేందుకు పూర్తిగా కొత్త వారితో రూపొందిన మూవీ
- ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమాను చూసి పోస్ట్ ప్రొడక్షన్, మార్కెటింగ్ కోసం 2 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టిన ‘పారామౌంట్ పిక్చర్స్’
- ప్రపంచవ్యాప్తంగా 194.2 మిలియన్ డాలర్ల వసూలు
టైటానిక్, అవతార్, అవెంజర్స్ ఎండ్‌గేమ్ వంటి సినిమాల సరసన చేరిన ‘పారానార్మల్ యాక్టివిటీ’ సినిమాను 2007లో ఓరెన్ పెలి రూపొందించారు. లో బడ్జెట్‌లో ఓ సినిమాను తీయాలని నిర్ణయించుకున్న ఓరెన్ పెలి.. ఒక హోం కెమెరాతో, మొత్తం కొత్త వారితో ఈ సినిమాకు రూపకల్పన చేశారు. నటులకు అతి తక్కువగా 500 డాలర్ల (దాదాపు రూ. 42 వేలు) పారితోషికం ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకు స్క్రిప్ట్ కూడా లేదు. హారర్ సీన్ల కోసం ప్రాక్టికల్ ఎఫెక్ట్‌లనే ఉపయోగించారు. అలా తెరకెక్కించిన సినిమా చివరికి ‘పారానార్మల్ యాక్టివిటీ’గా బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం మొత్తంగా 15 వేల డాలర్లు (దాదాపు రూ. 13 లక్షలు) ఖర్చు చేశారు. ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను చూసి ఆశ్చర్యపోయిన ‘పారామౌంట్ పిక్సర్చ్’ సంస్థ పోస్ట్ ప్రొడక్షన్, మార్కెటింగ్ కోసం 2 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టింది.
సెప్టెంబర్ 2009లో ఈ మూవీ థియేటర్లను పలకరించి అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 194.2 మిలియన్ డాలర్లు (రూ.1647 కోట్లు) వసూలు చేసింది. అంటే ఏకంగా 13 లక్షల రెట్లు అధికంగా లాభాలు ఆర్జించింది. ఈ సినిమా విజయం అందించిన ఉత్సాహంతో ఆ తర్వాత దీనికి మూడు స్వీక్వెల్స్, రెండు స్పినాఫ్స్ తెరకెక్కాయి. అవి కూడా ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి.