జగన్ తో పాటు అదానీని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా?: షర్మిల
- సోలార్ విద్యుత్ ఒప్పందాలపై విచారణ ఎందుకు జరపడం లేదని షర్మిల ప్రశ్న
- జగన్ లంచాలు తీసుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థలు నివేదికలు ఇచ్చాయని వ్యాఖ్య
- ఈ ముడుపుల అంశంపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరపాలని డిమాండ్
సీఎం జగన్ లంచాలు తీసుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థలు నివేదిక ఇచ్చాయని... నిజాలను నిగ్గు తేల్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై మౌనం వహిస్తున్నారని... విచారణ చేయకుండా ఉంటున్నారని విమర్శించారు. జగన్ తో పాటు అదానీని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.
సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భారీ అవినీతి ఉందని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిందని... పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆనాడు మీరు అనలేదా? అని ప్రశ్నించారు. గుజరాత్ లో రూ. 1.99కి దొరికే సౌర విద్యుత్ ను గత ప్రభుత్వం రూ. 2.49కి ఎలా కొనుగోలు చేసిందంటూ టీడీపీ ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు.
ఈ డీల్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో హైకోర్టులో కేసు కూడా వేయించారని షర్మిల అన్నారు. అదానీకి జగన్ అమ్ముడుపోయారని... దీనిపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని... సోలార్ పవర్ డీల్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు.