తప్పు చేస్తే పెద్దపెద్దవాళ్లే జైలుకు వెళ్లారు... కేటీఆర్ ఎంత?: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy takes on KTR and BRS
  • అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధి లేదన్న మంత్రి
  • కవితకు బెయిల్ వస్తుందని తెలిసి రెండ్రోజులు ముందే ఢిల్లీకి వెళ్లారని వ్యాఖ్య
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శ
తప్పు చేస్తే పెద్దపెద్ద వాళ్లే జైలుకు వెళ్లారు... ఇక కేటీఆర్ ఎంత? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధి లేదన్నారు.

మద్యం పాలసీ కేసులో అరెస్టైన కవితకు బెయిల్ వస్తుందని ముందే తెలియడంతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు రెండు రోజులు ముందే ఢిల్లీకి వెళ్లారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర సభలో కోమటిరెడ్డి...

సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను మూసీ నది పక్కన చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర ముగిసిన అనంతరం నాగిరెడ్డిపల్లిలో జరిగిన బహిరంగ సభలో కోమటిరెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు ఉద్యమం సమయం నుంచి నాటకాలు ఆడుతూనే ఉన్నారని మండిపడ్డారు.

ఉద్యమం సమయంలో తనకు అగ్గిపెట్టె దొరకలేదని హరీశ్ రావు అన్నారని... ఆ రోజు మనం నమ్మి ఉండవచ్చు... కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే డోజర్లకు అడ్డం పడతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని... అలా వస్తే వారి మీది నుంచి డోజర్లను పోనిస్తామని హెచ్చరించారు. తనను జైలుకు పంపిస్తే యోగా చేసి, పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెబుతున్నారని, కానీ ఆయన మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరని వ్యాఖ్యానించారు. పదేళ్లు సమయం ఇచ్చినా మూసీని ప్రక్షాళన చేయని బతుకు ఎందుకని ధ్వజమెత్తారు.
Go Back to Shorts
Komatireddy Venkat Reddy
Congress
BRS
Telangana

More Telugu News