10 నెలలు... 25 సార్లు ఢిల్లీ పర్యటనలు... అయిననూ పోయిరావలె!: రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

10 నెలలు... 25 సార్లు ఢిల్లీ పర్యటనలు... అయిననూ పోయిరావలె!: రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురక

KTR satire on Revanth Reddy delhi tour
  • రూపాయి లాభం లేకున్నా ఢిల్లీ పర్యటనలు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాయని ఎద్దేవా
  • రాష్ట్రంలో తట్ట మట్టి తీసింది లేదు... కొత్తగా చేసింది అసలే లేదని విమర్శ
  • మూసీ, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొడుతున్నారని ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పైసా పని లేకున్నా... రాష్ట్రానికి రూపాయి లాభం లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు మాత్రం సిల్వర్ జూబ్లీ చేసుకున్నాయని ఎద్దేవా చేశారు. ఈ మేరకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

10 నెలల కాలంలో 25 సార్లు ఢిల్లీకి వెళ్లారని, 50 రోజులు దేశ రాజధానిలో పర్యటించారని పేర్కొన్నారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు... ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేశావని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో తట్ట మట్టి తీసింది లేదని, కొత్తగా చేసింది అసలే లేదని విమర్శించారు.

"అన్నదాతల అరిగోసలు... గాల్లో దీపాల్లా గురుకులాలు... కుంటుపడ్డ వైద్యం... గాడి తప్పిన విద్యా వ్యవస్థ... అయిననూ పోయి రావలె హస్తినకు" అని చురక అంటించారు. "మూసీ పేరుతో, హైడ్రా పేరుతో  పేదోళ్ల పొట్టలు కొట్టి, 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి.. అయినను పోయి రావాలె హస్తినకు" అని వ్యంగ్యం ప్రదర్శించారు. పండగలు పండగల్లా లేవు... ఆడబిడ్డల చీరలు అందనేలేదు... అవ్వాతాతలు అనుకున్న పెన్షన్ రాలేదు... తులం  బంగారం జాడనే లేదు... స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవని విమర్శించారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం..!

ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలన శాండ్ మాఫియాకు అభయ హస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా విచ్చలవిడిగా ఇసుక దందాలు కనిపిస్తున్నాయన్నారు. బడా ఛోటా తేడా లేదు... మంత్రుల నుంచి మండలస్థాయి లీడర్ల వరకు ఇసుకను పిండి దండిగా ధనాన్ని దండుకుంటున్నారని పేర్కొన్నారు.

అధికారులకు మామూళ్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటుంటే... ఇక అడ్డగోలు తవ్వకాలను... అక్రమ రవాణాను అడ్డుకునేది ఎవరు? అని ప్రశ్నించారు. నదులను... వాగులను... వంకలను కొల్లగొట్టి ఖజానాకు చేరాల్సిన సొమ్మును కాంగ్రెస్ వాళ్లు తమ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల అండదండలతో అనధికార తవ్వకాలతో యథేచ్ఛగా  అడ్డూ అదుపూలేని ఇసుక దోపిడి సాగుతోందన్నారు.
Advertisement
KTR
Revanth Reddy
New Delhi
Telangana
BRS

More Telugu News