సాక్షి యాజమాన్యంపై టీటీడీ ఫిర్యాదుతో కేసు నమోదు ..ఎందుకంటే..?

TTD deputy eo filed a case against sakshi
  • సాక్షి యాజమాన్యంపై తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఫిర్యాదు
  • సీఎం ఆలయ అధికారులతో నిర్వహించిన సమీక్షపై అసత్య కథనాన్ని ప్రచురించారని ఫిర్యాదులో పేర్కొన్న డిప్యూటీ ఈవో 
  • సాక్షి యాజమాన్యంపై బీఎస్ఎస్ సెక్షన్లు 353(2), 356, 196(1)(ఏ) కింద ఎఫ్ఐఆర్
సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదయింది. టీటీడీ ఫిర్యాదు మేరకు సాక్షి యాజమాన్యంపై తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని టీటీడీ ఫిర్యాదు చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నెల 5న టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షకు సంబంధించి సాక్షి పత్రికలో అసత్య కథనాన్ని ప్రచురించిందని ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సాక్షి యాజమాన్యంపై బీఎస్ఎస్ సెక్షన్లు 353(2), 356, 196(1)(ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
 
6వ తేదీ సాక్షి ప్రధాన పత్రిక 13వ పేజీలో ‘నేను చూసుకుంటా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంలో అన్నీ అసత్యాలే ఉన్నాయని డిప్యూటీ ఈవో ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిలో మన స్టాండ్ ఏంటో మీకు తెలుసు కదా.. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పటయ్యే సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకేమాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి’ అని చంద్రబాబు సమీక్షకు హాజరైన అధికారులకు చెప్పినట్లుగా ప్రచురించారని ఆయన పేర్కొన్నారు. సాక్షి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే అసత్యాన్ని ప్రచురించిందని, సాక్షి దినపత్రిక యాజమాన్యం, నైతికంగా దానికి సంబంధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈవో ఫిర్యాదులో కోరారు. 
Go Back to Shorts
TTD
Tirumala
sakshi News paper

More Telugu News