Manju Huda: హర్యానా ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రిపై పోటీకి గ్యాంగ్‌స్టర్ భార్యను బరిలోకి దించిన బీజేపీ

Gangster wife Manju Hooda is BJP pick against Bhupinder Hooda in Haryana
  • ప్రస్తుతం రోహ్‌తక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఉన్న మంజు హుడా
  • గర్హి సంప్లా-కిలోయి నియోజకవర్గం నుంచి బరిలోకి 
  • కాంగ్రెస్ యోధుడు భూపిందర్‌సింగ్ హుడాతో అమీతుమీ
  • గ్యాంగ్‌స్టర్ రాజేశ్ హుడాను పెళ్లాడిన మంజు 
  • ఆమె తండ్రి ప్రదీప్ యాదవ్ గతంలో డీఎస్పీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ యోధుడు, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాను ఎదుర్కొనేందుకు గ్యాంగ్‌స్టర్ భార్యను బీజేపీ బరిలోకి దించింది. ఆమె పేరు మంజు హుడా. రోహ్‌తక్ జిల్లా పరిషత్ సిట్టింగ్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె గర్హి సంప్లా-కిలోయి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న ఈ స్థానాన్ని గెలుచుకుంటానని మంజు ధీమా వ్యక్తం చేశారు. 

ఎవరీ మంజు హుడా
రోహ్‌తక్‌కు చెందిన హిస్టరీ షీటర్ రాజేశ్ హుడా భార్యనే మంజు హుడా. ఆమె బ్యాక్ గ్రౌండ్‌ను ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా, తన భర్త గత చరిత్ర తనపై ప్రభావం చూపబోదని మంజు చెబుతున్నారు. మంజు తండ్రి ప్రదీప్ యాదవ్ గతంలో హర్యానా పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. రాజేశ్ హుడాను పెళ్లాడిన తర్వాత మంజు యాదవ్ తన పేరును మంజు హుడాగా మార్చుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా తాను చేసిన పనే తనను గెలిపిస్తుందని మంజు ఆశాభావం వ్యక్తం చేశారు. 

అక్టోబర్ 5న ఎన్నికలు
90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ ఈ నెల 4న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 8 మంది మహిళలు కాగా, 20 మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కూడా 32 మందితో కూడిన తొలి జాబితాను నిన్న విడుదల చేసింది.
Manju Huda
Haryana
BJP
Bhupinder Singh Hooda
Congress

More Telugu News