Harvinder Singh: స్వ‌ర్ణంతో చ‌రిత్ర సృష్టించిన హ‌ర్వింద‌ర్ సింగ్‌.. భార‌త్ ఖాతాలో 24 మెడ‌ల్స్‌!

Harvinder Singh shine with Gold as India edge close to 25 medals in Paris Paralympics
  • పారిస్‌ పారాలింపిక్స్‌లో అద్భుత‌ ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్న భార‌త అథ్లెట్లు
  • ఆర్చ‌రీలో స్వ‌ర్ణంతో మెరిసిన హ‌ర్వింద‌ర్ సింగ్‌
  • త‌ద్వారా పారాలింపిక్స్‌లో గోల్డ్ గెలిచిన‌ మొదటి భారతీయ ఆర్చర్‌గా రికార్డ్‌
  • 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్య పతకాల‌తో 13వ స్థానంలో భార‌త్  
పారిస్‌లో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్నారు. ప‌త‌కాల పంట పండిస్తున్నారు. తాజాగా పురుషుల వ్య‌క్తిగ‌త రిక‌ర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్‌లో ఆర్చ‌ర్ హ‌ర్వింద‌ర్ సింగ్ ఏకంగా స్వ‌ర్ణం కొల్ల‌గొట్టాడు. ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన లుకాస్జ్ సిజెక్‌ను 6-0తో ఓడించాడు. దీంతో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ ఆర్చర్‌గా హర్విందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. 

అటు ఒలింపిక్స్‌లోనూ ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్‌కు ఆర్చ‌రీలో గోల్డ్ మెడ‌ల్ రాలేదు. కాగా, 33 ఏళ్ల హర్విందర్ మూడేళ్ల‌ క్రితం టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన విష‌యం తెలిసిందే. త‌ద్వారా ఆర్చరీలో పతకం సాధించిన‌ మొదటి భారతీయ అథ్లెట్‌గానూ రికార్డుకెక్కాడు.  

ఇక టోక్యో పారాలింపిక్స్ 2020లో భార‌త్ 19 ప‌త‌కాలు సాధించింది. దాంతో ఈసారి 25 ప‌త‌కాలే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగింది టీమిండియా. దానికి త‌గ్గ‌ట్టుగానే భార‌త అథ్లెట్లు రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం భార‌త్ ఖాతాలో 24 ప‌త‌కాలు చేరాయి. మ‌రో ప‌త‌కం సాధిస్తే టార్గెట్‌ను అందుకుంటుంది. ఇందులో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తంగా ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ 13వ స్థానంలో కొన‌సాగుతోంది.
Harvinder Singh
Paris Paralympics

More Telugu News