మాంసాహారులకు వార్నింగ్.. రెడ్ మీట్ తో మధుమేహ ముప్పు
- అతిగా తింటే అనారోగ్యమే అంటున్న పరిశోధకులు
- గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని హెచ్చరిక
- జీవిత కాలం తగ్గిపోతుందని పలు పరిశోధనలలో వెల్లడి
స్టడీలో ఏం తేలిందంటే..
రోజూ 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ తీసుకునేవారికి మధుమేహం ముప్పు 15 శాతం ఎక్కువని, రోజూ 100 గ్రాముల రెడ్ మీట్ తీసుకుంటే ముప్పు 10 శాతం, రోజూ 100 గ్రాముల చికెన్ తీసుకునే వారికి 8 శాతం ఎక్కువని లాన్సెట్ స్టడీలో తేలింది. రెడ్ మీట్, ఇతర జంతువుల మాంసంలో ఎక్కువగా ఉండే హేమ్ ఐరన్ వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని హార్వర్డ్ టి.హెచ్.ఛాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో వెల్లడైంది.
నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రపంచవ్యాప్తంగా మాంసం వాడకం చాలా ఎక్కువ. రకరకాల ఆహార పదార్థాలుగా తయారుచేసుకుని తింటుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్ లోనూ మాంసాహారం ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే, అతిగా తీసుకోవడం వల్ల మాంసాహారంతో మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఎంత మాంసం తింటున్నారనే విషయంతో పాటు ఆ మాంసాహారం ఎలా వండారనేది కూడా ప్రభావం చూపుతుందని తెలిపారు. మాంసాహారం వండే క్రమంలో విడుదలయ్యే కొన్ని రకాల రసాయనాలు, హై లెవల్ శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇది టైప్ 2 మధుమేహానికి దారితీస్తుందని వివరించారు.