Bandi Sanjay: ఆ కేసులో కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay hot comments on KCR arrest
షార్ట్స్‌లో చూడండి
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మంచిర్యాల పర్యటనలో ఆయన తెలంగాణ విద్యా వ్యవస్థ, బీఆర్ఎస్ విలీనం, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ విద్యావ్యవస్థలో నక్సలిజాన్ని చొప్పించే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన సంస్కృతి, చరిత్ర మరుగునపడే ప్రమాదముందని హెచ్చరించారు. దేశ పరిణామాలపై అవగాహన లేకుంటే విచ్ఛిన్నమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇందుకు బంగ్లాదేశ్ సంక్షోభమే నిదర్శనమన్నారు.

కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కానుందని పునరుద్ఘాటించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో చెప్పాలన్నారు. 

కేసీఆర్ కొడుక్కి ఇంకా గర్వం తగ్గలేదని విమర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటున్నానన్నారు. బీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇందిరమ్మ ఫొటో పెడితే ఊరుకునేది లేదని, ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ఉండాలన్నారు.

రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి

రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పొంతన లేదన్నారు. సోనియాగాంధీ పుట్టిన రోజు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కొందరికే మాఫీ చేశారని ఆరోపించారు. రూ.40 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి... సోనియా గాంధీనే మోసం చేసిన ఘనులు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
Go Back to Shorts
Bandi Sanjay
Congress
KCR
Telangana

More Telugu News