జనజీవన స్రవంతిలోకి ఇద్దరు మావోయిస్టులు
- భద్రాద్రి జిల్లాలో పోలీసుల వద్ద స్వచ్చందంగా లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
- మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
- మావోయిస్టుల లొంగుబాటుకు ‘ఆపరేషన్ చేయూత’ నిర్వహిస్తున్న భద్రాద్రి పోలీసులు
లొంగిపోయిన మావోయిస్టు లక్ష్మయ్యది చర్ల మండలం కిష్టారంపాడు గ్రామం. 2021లో చర్ల – శబరి ఏరియా కమిటీ మిలీషియా కమాండర్ వెట్టి దేవా అలియాస్ బాలు వద్ద మిలీషియా సభ్యుడిగా చేరాడు. అతడి వద్దే ఉంటూ పార్టీకి నిత్యావసర సరుకులు అందించడం, పార్టీ ఆదేశించిన పనులు చేస్తూ 2022 అక్టోబర్‌లో దళ సభ్యుడుగా పదోన్నతి పొందాడు. కొన్ని రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యుడు ఆజాద్‌కు గార్డుగానూ లక్ష్మయ్య పని చేశాడు. అనంతరం కొన్ని రోజులకు చర్ల ప్లాటూన్‌లో దళ సభ్యుడిగా పని చేసి.. గత ఏడాది శబరి ఏరియా కమిటీకి బదిలీ అయ్యాడని ఎస్పీ రోహిత్ వివరించారు.
ఇక లొంగిపోయిన మరో మావోయిస్టు మల్లం దేవాది చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందినవాడు. 2007 నుంచి 2015 వరకు మావోయిస్టు పార్టీకి చెందిన బాలల సంఘంలో పని చేశాడు. తర్వాత గొల్లపల్లి ఎల్వోఎస్ కమాండర్ మడకం ఉంగల్ అలియాస్ ఎర్రాల్ వద్ద సభ్యుడుగా చేరి.. 2017లో మిలీషియా కమాండర్‌గా పదోన్నతి పొందాడు. 2020లో దళ సభ్యుడిగా పదోన్నతి పొంది ఇప్పటివరకు గొల్లపల్లి దళ సభ్యుడిగా కొనసాగాడు. గొల్లపల్లి ఎల్వోఎస్ కమాండర్ ఎర్ర దాదా (డీవీసీ) చనిపోయాక తర్వాత అతడి స్థానంలో దేవా ఇన్‌ఛార్జిగా పని చేశారు.
కాగా వివిధ కారణాలతో అడవి బాట పట్టి మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న వారిని జనజీవన స్రవంతిలో కలిపేందుకు భద్రాద్రి పోలీసులు ఆపరేషన్ చేయూత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి తదితర కారణాలతో మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి లొంగిపోయిన వారు సాధారణ జీవనం కొనసాగించేందుకు పోలీసులు చేయూతను అందిస్తున్నారు.