Polavaram Project: 'పోలవరం శ్వేతపత్రం'పై అంబటి రాంబాబు ఫైర్

Ambati Rambabu fires on Cahnadrababu over Polavaram White Paper
  • పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
  • చంద్రబాబు వల్లే పోలవరం నాశనం అయిందన్న అంబటి రాంబాబు
  • జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను నాడు చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని నిలదీత
  • పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని నాడు మోదీనే అన్నారని వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో, వైసీపీ నేత, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు వల్లే పోలవరం నాశనం నాశనం అయిందని అన్నారు. 

పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు, దాన్ని రాష్ట్రం ప్రభుత్వం ఎందుకు తీసుకుందని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటని అంబటి రాంబాబు నిలదీశారు. వేల కోట్ల విలువైన ప్రాజెక్టు కాబట్టే, నాడు చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని తలకెత్తుకుందని విమర్శించారు. 

కమీషన్లు కొట్టేయడానికే పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారని ఆరోపించారు. డబ్బులు కొట్టేయడానికే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారని ప్రధాని మోదీనే అన్నారని అంబటి రాంబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిపోయిందని మోదీ అన్నారంటే దానర్థం ఏమిటి? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు ఎందుకు తీసుకున్నారన్నది ఏ కాంట్రాక్టర్ కైనా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. 

"పోలవరం అంటేనే వైఎస్సార్ ప్రాజెక్టు. అన్ని అనుమతులు తెచ్చి ప్రాజెక్టు మొదలుపెట్టిందే వైఎస్సార్. వైఎస్సార్ కలలు కన్న ప్రాజెక్టు కాబట్టే మేం తపనతో పనిచేశాం. చంద్రబాబు చేసిన తప్పులే పోలవరానికి శాపాలయ్యాయి. వైసీపీ ప్రభుత్వ పాలనలో పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒక్క చిన్న తప్పు కూడా జరగలేదు. ఆఖరికి కరోనా సంక్షోభం సమయంలోనూ పోలవరం పనులు ఆగలేదు. పోలవరం అంత తేలిగ్గా అర్థమయ్యే వ్యవహారం కాదు కాబట్టే, దానిపై అధ్యయనం చేసి నిర్ణయానికి వచ్చాం. 

మీరు (చంద్రబాబు) చేసిన తప్పుల వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఈ గతి పట్టిందని మేం నిరూపించగలం. డయాఫ్రం వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో నిపుణులను అడగండి. కానీ జగన్ పై నిందలు వేయాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ అంటే భయపడుతున్నందునే చంద్రబాబు దూషిస్తున్నారు" అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
Polavaram Project
White Paper
Ambati Rambabu
Chandrababu
YSRCP
TDP

More Telugu News