Rohit Sharma: టీ20 వరల్డ్ కప్‌లో ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma breaks all time record for fours in T20 World Cup 2024
  • టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా అవతరణ
  • మొత్తం 113 ఫోర్లు బాదిన టీమిండియా కెప్టెన్
  • టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 50 సిక్సర్లు బాదిన రెండవ ఆటగాడిగానూ చరిత్రకెక్కిన హిట్‌మ్యాన్
టీ20 వరల్డ్ కప్2024లో భారత్ పైనల్ చేరడంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు విజయాలకు బాటలు వేశాడు. మరీ ముఖ్యంగా సూపర్-8లో బలమైన జట్టయిన ఆస్ట్రేలియా.. సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై గెలుపులో హిట్‌మ్యాన్ కీలక పాత్ర పోషించాడు. గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లను రోహిత్ శర్మ చితక్కొట్టాడు. ఒక పక్క కోహ్లీ, పంత్ ఔట్ అయినా జోరు తగ్గించలేదు. 39 బంతుల్లోనే 57 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 2 భారీ సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో 5వ ఫోర్‌ కొట్టాక రోహిత్ శర్మ ఒక ఆల్ టైమ్ వరల్డ్ కప్ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం 113 ఫోర్లతో టీ20 ప్రపంచ కప్‌ల హిస్టరీలో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ అవతరించాడు. 111 ఫోర్లతో ఇంతకాలం టాప్ ప్లేస్‌లో ఉన్న శ్రీలంక దిగ్గజ బ్యాటర్ మహేల జయవర్ధనేని రోహిత్ అధిగమించాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 105 ఫోర్లతో 3వ స్థానంలో నిలిచాడు. 

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఫోర్లు..
1. రోహిత్ శర్మ - 113 ఫోర్లు ( 43 మ్యాచ్‌ల్లో)
2. మహేల జయవర్ధనే -  111 ఫోర్లు (31 మ్యాచ్‌ల్లో)
3. విరాట్ కోహ్లీ - 105 ఫోర్లు (32 మ్యాచ్‌ల్లో)
4. డేవిడ్ వార్నర్ - 103 ఫోర్లు (41 మ్యాచ్‌ల్లో)
5. తిలకరత్నే దిల్షాన్ - 101 ఫోర్లు (34 మ్యాచ్‌ల్లో).

కాగా ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్ టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో 50 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు నమోదు చేసిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లండ్‌పై రెండు సిక్సర్లతో అతడి సిక్సర్ల సంఖ్య 50కి చేరింది. కాగా 63 సిక్సులతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తొలి స్థానంలో నిలిచాడు.

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ 5,000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ రికార్డు సాధించిన ఐదవ భారత క్రికెటర్‌గా నిలిచాడు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ ఉన్నారు.
Rohit Sharma
T20 World Cup 2024
Cricket
India vs England

More Telugu News