Postal Ballots: వైసీపీకి చుక్కెదురు... పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు

AP High Court upheld EC argument in Postal Ballots issue
  • పోస్టల్ బ్యాలెట్ పై ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్
  • ఈసీ నిబంధనలకు విరుద్ధంగా సీఈవో మెమో ఇచ్చారని ఆరోపణ
  • తీర్పును నేటికి రిజర్వ్ చేసిన హైకోర్టు
  • నేడు ఈసీ వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెల్లడి
పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని, స్టాంపు, హోదా లేకపోయినా ఫర్వాలేదన్న ఈసీ వాదనలను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. 

పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం-13ఏపై ఆర్వో సంతకంతో పాటు కనీసం చేతిరాతతో అయినా హోదా వివరాలు రాసి ఉండాలని ఈసీ గతంలో పేర్కొందని, కానీ ఏపీ సీఈవో అందుకు భిన్నంగా మెమో జారీ చేశారని వైసీపీ తన పిటిషన్ లో ఆరోపించింది. సంతకం ఉంటే చాలని, సీల్ లేకపోయినా ఫర్వాలేదని మెమోలో పేర్కొనడం ఈసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు నిన్న వాదనలు విన్న పిమ్మట తీర్పును నేటికి వాయిదా వేసింది. ఇవాళ ఈసీతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్ పై స్టాంపు లేకపోయినా అది కౌంటింగ్ కు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో వైసీపీ పిటిషన్ ను తోసిపుచ్చింది.
Postal Ballots
AP High Court
YSRCP
EC
Andhra Pradesh

More Telugu News