Team India: అమెరికాలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోహిత్ సేన

Team India Starts Training In New York Hardik Pandya Joins Teammates
  • న్యూయార్క్ లోని నసావు కౌంటీ అంతర్జాతీయ స్టేడియంలో సాధన
  • అభిమానులతో సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న స్టార్ ప్లేయర్లు
  • జట్టుతో కలిసిన హార్దిక్ పాంఢ్యా.. ‘ఆన్ నేషనల్ డ్యూటీ’ అంటూ పోస్ట్
జూన్ 2 నుంచి జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం టీం ఇండియా సిద్ధమవుతోంది. అమెరికా, వెస్టిండీస్ లలో జరగనున్న ఈ టోర్నీకోసం సోమవారం నుంచి వార్మప్ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రోహిత్ సేన మంగళవారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. న్యూయార్క్‌ లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఆధ్వర్యంలో సాధన చేసింది. ఇందులో రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ తదితరులు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆటగాళ్లంతా కాసేపు ఫుట్ బాల్ ఆడారు. ఆ తర్వాత వర్కౌట్స్ చేశారు. 

ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ఆటగాళ్లు తమ అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో మన ఆటగాళ్లంతా జాగింగ్ చేస్తూ కనిపించారు.

వ్యక్తిగత కారణాల వల్ల జట్టుతోపాటు అమెరికా వెళ్లని ఆల్ రౌండర్ హార్దిక్ పాంఢ్యా విడిగా అక్కడకు చేరుకున్నాడు. జట్టులోని సహచరులతో కలసి ప్రాక్టీస్ చేశాడు. ‘ఆన్ నేషనల్ డ్యూటీ’ అంటూ తన ప్రాక్టీస్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. మరోవైపు ‘కింగ్’ కోహ్లీ ఇంకా జట్టులోకి చేరాల్సి ఉంది.

గ్రూప్ ఏలో ఉన్న రోహిత్ సేన ఐర్లాండ్, కెనడా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తోపాటు అమెరికాతో తలపడనుంది. జూన్ 5న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అలాగే జూన్ 1న బంగ్లాదేశ్ తో వార్మప్ గేమ్ శక్తిసామర్థ్యాలను పరీక్షించుకోనుంది.
Team India
Cricket
T20 World Cup 2024
Newyork
Practice
Social Media
Photos
Viral
Hardhik Pandhya
Jaspreet Bumrah

More Telugu News