Shah Rukh Khan: ఒక జట్టు యజమానిగా నన్ను అత్యంత బాధకు గురిచేసిన సందర్భం అదే: షారుఖ్ ఖాన్

Shah Rukh Khan Reveals Saddest Moment As Owner of Kolkata Knight Riders
  • ఐపీఎల్ ఆరంభ రోజుల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆటతీరును ప్రశ్నించడం బాధ కలిగించిందన్న షారుఖ్
  • ఒకాయన జట్టు కిట్ మాత్రమే బాగుంది.. ఆట బాలేదన్నారని వెల్లడి
  • కో‌ల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్ చేరిన నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్‌కి ప్రత్యేక ఇంటర్వ్యూ 
ఐపీఎల్-2024 విజేత ఎవరనేది నేడు (ఆదివారం) తేలిపోనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. కాగా కోల్‌కతా జట్టు విజయవంతంగా ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్‌‌తో మాట్లాడిన ఆ జట్టు ఓనర్, బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఒక జట్టు యజమానిగా అత్యంత బాధకు గురిచేసిన సందర్భాన్ని ఆయన బయటపెట్టాడు. ఐపీఎల్ ఆరంభ రోజులలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆటతీరుపై సందేహాలు లేవనెత్తడం తనకు చాలా బాధ కలిగించిందని షారుఖ్ చెప్పాడు.

‘‘నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒకాయన నా దగ్గరికి వచ్చి ప్లేయింగ్ కిట్ (జెర్సీలు, ఇతరత్రా) మాత్రమే బాగుంది, ఆట బాలేదని నాతో అన్నారు. ఒక క్రికెట్ విశ్లేషకుడు ఈ విధంగా నాతో మాట్లాడడం బాగా గుర్తుంది. ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా బాధగా ఉండేది. అయితే గౌతమ్ గంభీర్‌ని తీసుకొచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది. ఓడిపోకుండా ఉండడం నేర్చుకున్నాం’’ అని షారూఖ్ పేర్కొన్నాడు. 

ఐపీఎల్ పలు సీజన్లలో కో‌ల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచిన సందర్భాలు ఉన్నప్పటికీ జట్టు దుస్తులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం తనకు ఎక్కువ బాధ కలిగించిందని అన్నాడు. ఈ మేరకు ‘స్టార్ స్పోర్ట్స్‌’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ ఈ విధంగా మాట్లాడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 జట్లలో ఒకటని షారుఖ్ అభివర్ణించాడు.
Shah Rukh Khan
Kolkata Knight Riders
IPL 2024
IPL
Sunrisers Hyderabad

More Telugu News