Bengaluru Rave party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్

AP minister kakanis aid arrested in Bengaluru rave party case
  • కేసు దర్యాప్తును వేగవంతం చేసిన బెంగళూరు పోలీసులు 
  • మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ
  • పార్టీ ఏర్పాటులో మంత్రి కాకాణి అనుచరుడికి ముఖ్యపాత్రగా గుర్తించిన వైనం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీసీబీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల అనుచరులు కొందరు ఉన్న విషయం తెలిసిందే. 

ఇప్పటికే పార్టీలో మంత్రి కాకాణి పేరు ఉన్న కారు స్టిక్కర్ ను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా హైదరాబాద్ కు చెందిన పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీ ఏర్పాటులో ఆయనది ముఖ్య పాత్ర అని, ఆయన మంత్రి అనుచరుడేనని పోలీసులు ధ్రువీకరించారు. ఇప్పటికే అరెస్టయిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు అరుణ్ కుమార్ సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించారు. ఈ పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమ సహా మొత్తం ఎనిమిది మందికి సీసీబీ పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో బయటపడిందని తెలిపారు. వీరిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు.
Bengaluru Rave party
Kakani Govardhan Reddy
Hyderabad

More Telugu News