NIIMS: యువకుడి ఛాతిలో బాణం.. ప్రాణాలు కాపాడిన నిమ్స్ వైద్యులు

NIIMs doctors successfully removes arrow from youths chest
  • ఛత్తీస్‌గఢ్ గిరిజన యువకుడికి ఛాతిలో దిగిన బాణం
  • వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకొచ్చిన కుటుంబసభ్యులు
  • తీవ్ర రక్తస్రావమైన యువకుడికి రక్తం ఎక్కిస్తూ ఆపరేషన్, బాణాన్ని తొలగించిన వైద్యులు
  • ఆపరేషన్ విజయవంతం కావడంతో నిలిచిన యువకుడి ప్రాణాలు

ఛాతిలో బాణం దిగి ప్రాణాల కోసం పోరాడుతున్న గిరిజన యువకుడిని నిమ్స్ వైద్యులు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊనూర్ ప్రాంతానికి చెందిన సోది నంద (17) అనే గుత్తికోయ యువకుడు గురువారం అడవిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి ప్రమాదవశాత్తూ ఛాతిలో బాణం దిగింది. వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు. 

వైద్యులు తొలుత యువకుడికి సిటీ స్కాన్ చేశారు. ఊరితితిత్తుల పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్టు గుర్తించారు. అప్పటికే భారీగా రక్తస్రావం కావడంతో యువకుడికి రక్తం ఎక్కిస్తూనే ఆపరేషన్ చేసి బాణాన్ని తొలగించారు. బాణం దిగిన చోట రక్తం గడ్డకట్టడంతో అధికరక్త స్రావం కాలేదని, దీంతో యువకుడి ప్రాణాలు నిలిచాయని వైద్యులు అన్నారు. యువకుడు బలవంతంగా బాణం బయటకు తీసి ఉంటే రక్తస్రావమై ప్రాణాలు పోయి ఉండేవని అన్నారు. ఆపరేషన్ ఉచితంగా చేశామని కూడా వెల్లడించారు. కాగా, శస్త్రచికిత్స చేసిన డా. అమరేశ్వరరావు వైద్య బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ అభినందించారు.

  • Loading...

More Telugu News