ఇది వరకు బ్రూకాఫీ ఉండేది... ఇప్పుడు 'బ్రూ' ట్యాక్స్ వచ్చింది: కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇది వరకు బ్రూకాఫీ ఉండేది... ఇప్పుడు 'బ్రూ' ట్యాక్స్ వచ్చింది: కేటీఆర్

KTR says BRS government gave 2 lakh jobs in 10 years
  • బ్రూ ట్యాక్స్ అంటే.. భట్టి, రేవంత్, ఉత్తమ్ అన్న కేటీఆర్
  • రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారని విమర్శ
  • కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • ఉమ్మడి ఏపీలో రాష్ట్రపతి ఉత్తర్వులను యథేచ్ఛగా ఉల్లంఘించారన్న కేటీఆర్
  • తాము మాత్రం అటెండర్ ఉద్యోగం నుంచి గ్రూప్ 1 వరకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లు తెచ్చామన్న కేటీఆర్
ఇదివరకు బ్రూ కాఫీ ఉండేదని... ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... బ్రూ (BRU) ట్యాక్స్ అంటే.. భట్టి, రేవంత్, ఉత్తమ్ అని ఆరోపించారు. ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది కాబట్టి ఇక ఎవరి దుకాణం వారే తెరుస్తారని విమర్శించారు. రక్తం రుచిమరిగిన పులులు అని ధ్వజమెత్తారు. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారన్నారు.

ఇలాంటి పనులతో నిర్మాణ రంగం కుదేలవుతుందని... పరిశ్రమలు వెళ్లిపోతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో లేదని... అందుకే బ్రూ ట్యాక్స్ తెచ్చారన్నారు. మీరు ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇలా చేస్తుండవచ్చు... కానీ ఇలా ఉంటే కొత్త పరిశ్రమలు తేవడం మాట పక్కన పెడితే ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందన్నారు.

కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదని అబద్ధపు ప్రచారం

కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదని కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తమ హయాంలో 2.32 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ఈ ఐదు నెలల్లో కేసీఆర్ ఇచ్చిన వారికే ఉద్యోగాలు ఇచ్చింది తప్ప కొత్తగా ఎవరికీ ఇవ్వలేదన్నారు. పైగా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చామన్నారు. తాము 30వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఆ ఉద్యోగాలు మీరే ఇస్తే కనుక నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు?    పరీక్షలు ఎప్పుడు పూర్తయ్యాయి? అపాయింటుమెంట్ లెటర్ ఎప్పుడు ఇచ్చారు? చెప్పాలన్నారు. సీఎం స్థాయిలో ఉండి అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. గత పదేళ్లలో తెలంగాణ కంటే దేశంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు. అలా నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని... లేదంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం 2.37 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెలుసుకోవాలన్నారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రపతి ఉత్తర్వులను యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆరోపించారు. నాన్ లోకల్ కోటా పేరిట తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని స్థానిక కోటా 95 శాతం తాము అమలు చేశామన్నారు. అటెండర్ ఉద్యోగం నుంచి గ్రూప్ 1 వరకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లు తెచ్చామన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 26 వేలే అన్నారు. అందులోనూ తెలంగాణ యువతకు వచ్చింది 10 వేల ఉద్యోగాలే అన్నారు. కానీ తమ హయాంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు.
Advertisement
KTR
Revanth Reddy
Congress
BRS

More Telugu News