Pet dog: కుక్క కరిచిందని యువకుడిపై దాడి.. హైదరాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో!

Three injured in family clash over pet dog in Hyderabad Madhura nagar
  • అడ్డొచ్చిన ఆడవాళ్లపైనా విచక్షణారహితంగా దాడి
  • పెంపుడు కుక్క కరవడంతో మధురానగర్ లో రెండు కుటుంబాల మధ్య గొడవ
  • పోలీసులకు ఫిర్యాదు.. వారం తర్వాత కర్రలతో దాడి చేసిన బాధిత ఫ్యామిలీ

పెంపుడు శునకం రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది.. కర్రలు, రాళ్లతో దాడి చేసుకునేదాకా తెచ్చింది. వీళ్లు ప్రేమగా పెంచుకుంటున్న కుక్క అదే వీధిలో ఉంటున్న మరో కుటుంబానికి చెందిన వ్యక్తిని కరవడంతో గొడవ మొదలైంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు.. మరుసటిరోజు రోడ్డు మీద కుక్కతో కనిపించిన యువకుడిని పట్టుకుని చితకబాదారు. అడ్డొచ్చిన ఆడవాళ్లపైనా కర్రలతో దాడి చేశారు. చుట్టుపక్కల వాళ్లు కూడా రావడంతో కాసేపటి తర్వాత శాంతించారు. ఈ దాడిలో దెబ్బలు తిన్న యువకుడి కుటుంబం ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరా రికార్డు చేసింది. వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పోలీసుల వివరాల ప్రకారం.. మధురానగర్ లో మధు, ధనుంజయ్ కుటుంబాల మధ్య ఈ గొడవ జరిగింది. మధు కుటుంబం పెంపుడు కుక్క కిందటి బుధవారం ధనుంజయ్ కుటుంబ సభ్యుడిని కరిచింది. దీంతో మధు కుటుంబంతో గొడవపడ్డ ధనుంజయ్.. సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వారం రోజుల తర్వాత మంగళవారం రాత్రి మధు సోదరుడు శ్రీనాథ్ తమ పెంపుడు కుక్కను వాకింగ్ తీసుకెళ్లాడు. రోడ్డు మీద కుక్కతో కనిపించిన శ్రీనాథ్ ను చూసి ధనుంజయ్ కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. కర్రలతో విచక్షణారహితంగా దాడికి దిగారు. కుక్కపైనా దాడి చేశారు. గొడవ గమనించి శ్రీనాథ్ సోదరి, తల్లి పరుగెత్తికెళ్లి అడ్డుకున్నారు. అయినా సరే ధనుంజయ్ కుటుంబానికి చెందిన యువకులు కర్రలతో కొట్టడం ఆపలేదు. దీంతో ఆ మహిళలు ఇద్దరికీ గాయాలయ్యాయి. ఇంతలో చుట్టుపక్కల వాళ్లు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ యువకులు వెళ్లిపోయారు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీనాథ్ ను, ఆయన సోదరి, తల్లిని ఆసుపత్రికి, కుక్కను వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు ధనుంజయ్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News