Hyderabad: పవన్ కల్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై దాడి!

Attack on Pawan Kalyan Personal Security in Hyderabad
  • హైదరాబాద్ మీర్‌పేట్‌లోని లెనిన్ నగర్‌లో ఘ‌ట‌న‌
  • పాత కక్షలతోనే రాజు అనే వ్యక్తి త‌న బంధువుల‌తో క‌లిపి వెంకట్ ఇంటిపై దాడి
  • ఇంటి ముందున్న బైక్‌ను ధ్వంసం చేసి వెంక‌ట్‌పై దాడికి ప్రయత్నించ‌డంతో అడ్డుకున్న స్థానికులు 
  • ఈ వివాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మీర్‌పేట్‌ పోలీసులు  
హైదరాబాద్ మీర్‌పేట్‌లోని లెనిన్ నగర్‌లో జ‌న‌సేనాని పవన్ కల్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై కొంద‌రు దాడికి పాల్ప‌డ్డారు. ఇంటిపైన రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. పాత కక్షలతోనే రాజు అనే వ్యక్తి వెంకట్ ఇంటి ముందు ఉన్న ద్విచ‌క్ర‌వాహ‌నానికి నిప్పుపెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేసిన‌ట్లు స‌మాచారం. బైక్‌ను ధ్వంసం చేసి వెంక‌ట్‌పై కూడా దాడి చేయడానికి ప్రయత్నించ‌డంతో స్థానికులు అడ్డుకున్నారు. 

వెంకట్ తన భార్య సరిత, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కలసి ఐదేళ్లుగా లెనిన్ నగర్‌లోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో ఇంటి ఎదురుగా ఉండే రాజు వారి బంధువులు పాత గొడవల నేపథ్యంలో ఈ నెల 15న‌ రాత్రి ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఇంటి ప‌క్క‌న‌ ఉండే అబ్బాయి వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో వెంకట్ భార్య సరిత అబ్బాయిని కొట్టడంతో వివాదం మొదలైంది.  

మే 15న వెంకట్ ఇంటిపై కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వెంకట్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్ప‌పడ్డారు. దీంతో వెంక‌ట్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మీర్‌పేట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదంపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Telangana
Pawan Kalyan

More Telugu News