Prajwal Revanna Sex Scandal: దేవెగౌడ మనవడు ప్రజ్వల్ పెన్‌డ్రైవ్‌లో 3 వేల మంది మహిళల అశ్లీల వీడియోలు... ఇరకాటంలో బీజేపీ!

JDS MP Prajwal Revanna Sex Scandal Case Prajwal Pen Drive Has 3000 Sex Videos
  • హసన్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలోకి ప్రజ్వల్ రేవణ్ణ
  • విషయం వెలుగు చూసిన వెంటనే ప్రజ్వల్ ఫ్రాంక్‌ఫర్ట్‌ పరారైనట్టు అనుమానం
  • ఐదు నెలల క్రితమే ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ నేతల లేఖ
  • ఆ వీడియోలు, ఫొటోలు కాంగ్రెస్ జాతీయ నేతలకు చేరాయని ఆందోళన
  • బీజేపీపై నిప్పులు చెరుగుతున్న విపక్షాలు
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన పెన్‌డ్రైవ్‌లో ప్రభుత్వ అధికారులు సహా దాదాపు 3 వేల మంది మహిళల సెక్స్ వీడియోలు ఉండడం, ఆ వీడియోలు బయటకు రావడం సంచలనమైంది. ఈ నేపథ్యంలో, ప్రజ్వల్ జర్మనీ పారిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. తాజాగా, ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బీజేపీ పెద్దలకు ముందే తెలుసన్న విషయం బయటపడింది.

ప్రజ్వల్ అరాచకాలపై బీజేపీ అధిష్ఠానం దృష్టికి
గతేడాది డిసెంబర్ 8న బీజేపీ నేత దేవరాజె గౌడ.. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రకు లేఖ రాస్తూ ప్రజ్వల్ సహా దేవెగౌడ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ పెన్‌‌డ్రైవ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు సహా 2,976 మంది మహిళల అశ్లీల వీడియోలు ఉన్నట్టు తెలిపారు. వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరో పెన్‌డ్రైవ్‌లో మహిళల అశ్లీల చిత్రాలు ఉన్నాయని, అవి ఇప్పటికే కాంగ్రెస్‌లోని జాతీయ స్థాయి నేతలకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రజ్వల్ మాత్రమే కాదు.. ఆయన తండ్రి కూడా!
మరోవైపు, ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత రేవణ్ణ ఇంటిలో పనిచేసే 47 ఏళ్ల మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రజ్వల్ తోపాటు ఆయన తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ తనను లైంగికంగా హింసించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

‘‘నేను పనిలో చేరిన నాలుగు నెలల తర్వాత ప్రజ్వల్ ఫోన్ చేసి తన గదికి రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. ఇంట్లో ఆరుగురు మహిళలు పనిచేస్తున్నారు. తాము ఇక్కడికి రావడంతోనే భయపడిపోయామని వారు చెప్పారు. ఇంట్లోని పురుష పనివారు కూడా జాగ్రత్తగా ఉండాలని మహిళలను హెచ్చరించేవారు’’ అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఆయన ( ప్రజ్వల్) తన భార్య ఇంట్లో లేనప్పుడు తమను స్టోర్‌ రూముకు పిలిచి తమకు పండ్లు ఇస్తూ అసభ్యంగా తాకేవాడని ఆమె పేర్కొంది. చీర పిన్‌లు తొలగించి లైంగిక దాడికి పాల్పడేవాడని తెలిపారు. ప్రజ్వల్ తన కుమార్తెతోనూ అలాగే ప్రవర్తించే ప్రయత్నం చేస్తే, అతడి నంబరును బ్లాక్ చేసిందని పేర్కొన్నారు.

దర్యాప్తు కోసం నాలుగు బృందాలు
ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ దుమారం రేపుతుండడంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ... ప్రజ్వల్ పూర్వాపరాలు తెలిసినప్పటికీ, బీజేపీ కార్యకర్తలు లేఖలు రాసినప్పటికీ, ఆయన బాధితులు వేలల్లో ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది సోమవారం ఎక్స్‌లో ప్రజ్వల్‌పై విరుచుకుపడ్డారు. ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Prajwal Revanna Sex Scandal
HD Deve Gowda
Sex videos
Karnataka
Prajwal Revanna
JDS
BJP
Congress

More Telugu News