ఇండియాలో మరో పుతిన్ తయారవుతుండటం ఆందోళన కలిగిస్తోంది: శరద్ పవార్
- దేశంలో నిరంకుశత్వం రాకుండా ప్రజలు అడ్డుకోవాలని పవార్ పిలుపు
- ఎదుటి వారిని విమర్శించడాన్నే మోదీ పనిగా పెట్టుకున్నారని మండిపాటు
- గత ఎన్నికల్లో నవనీత్ కౌర్ కు మద్దతు పలికినందుకు క్షమాపణ చెపుతున్నానన్న పవార్
రాజ్యాంగాన్ని మారుస్తామని కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే చెపుతున్నారని శరద్ పవార్ మండిపడ్డారు. దేశంలో నిరంకుశత్వం రాకుండా ప్రజలు అడ్డుకోవాలని, ఓటు ద్వారా వారికి గుణపాఠం చెప్పాలని అన్నారు. పుతిన్ ను అనుకరిస్తూ అందరిలో భయాందోళనలను సృష్టించేందుకు మోదీ యత్నిస్తున్నారని చెప్పారు. మన దేశంలో తయారవుతున్న పుతిన్ (మోదీ)ని చూసి ఆందోళనకు గురవుతున్నానని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించాలని పిలుపునిచ్చారు.
అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్పేందుకే తాను ఇక్కడకు వచ్చానని పవార్ తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి, గెలుపొందిన నవనీత్ కౌర్ (సినీ నటి)కు తాను మద్దతుగా నిలిచానని... ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఇక్కడకు వచ్చానని చెప్పారు. మరోవైపు నవనీత్ కౌర్ ఇటీవలే బీజేపీలో చేరారు. అమరావతి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.