కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ అండగా వుంటాయి: ధైర్యం చెప్పిన కిషన్ రెడ్డి

Kishan Reddy says modi government is with farmers and people of telangana
  • ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను అడుగడుగునా ప్రశ్నించాలన్న కిషన్ రెడ్డి
  • ఓటేయమని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రచారానికి వస్తే నిలదీయాలని సూచన
  • కేంద్రం ఇచ్చిన నిధుల నుంచి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతులకు ఇవ్వాలని డిమాండ్
ప్రజలకు, రైతులకు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ అండగా ఉంటాయని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను అడుగడుగునా సమస్యలపై ప్రశ్నించాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయమని అడిగితే కనుక ఏం చేశారు? అని ప్రశ్నించాలని అన్నారు. రైతులకు కనుక ఎరువులు, విత్తనాలు అందకుంటే రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి తెలియజేయాలన్నారు.

కాంగ్రెస్ చేసిన మోసాలకు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పారు. ఏ కష్టం వచ్చినా తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి రైతులు కాంగ్రెస్ నేతల్ని నిలదీసి అడగాలన్నారు. కానీ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని కోరారు.

కేంద్రం ఇచ్చిన నిధుల నుంచి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులు ఎవరైనా ఉంటే స్థానిక తహసీల్దారు కార్యాలయాల్లో వివరాలు అందించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడితే తమకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఈ 9904119119 మొబైల్ నెంబర్‌కి కాల్ చేయాలని సూచించారు.
Go Back to Shorts
G. Kishan Reddy
BJP
Telangana
Narendra Modi

More Telugu News