IAS: అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు ఐఏఎస్‌ అధికారి రవి

Telugu IAS officer Ravi take charge as Chief Secretary of Assam Government
  • ఆదివారం బాధ్యతల స్వీకరణ
  • 1993వ బ్యాచ్ అసోం-మేఘాలయ కేడర్‌కు చెందిన అధికారి
  • స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వేర్వేరు బాధ్యతలు నిర్వర్తించిన రవి  

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి రవి కోత అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్ర 51వ సీఎస్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 1993వ బ్యాచ్‌ అసోం-మేఘాలయ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన రవి ఆదివారమే బాధ్యతలు స్వీకరించారు. పబన్‌కుమార్‌ బోర్తకుర్‌ రిటైర్ కావడంతో ఆయన స్థానంలో రవి బాధ్యతలు తీసుకున్నారు.

1966 ఏప్రిల్‌ 12న రవి జన్మించారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీహెచ్దీ చేసి డాక్టరేట్ అందుకున్నారు. 30 ఏళ్ల సర్వీసులో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వేర్వేరు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని భారతీయ రాయబార కార్యాలయం ఆర్థిక విభాగ హె‌డ్‌గా కూడా పనిచేశారు.  భారత్‌-అమెరికా దౌత్య సంబంధాలు, భాగస్వామ్యంపై విస్తృతంగా పనిచేశారు. 

15వ ఆర్థిక సంఘానికి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ సమయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి కమిషన్‌కు కీలకమైన రిపోర్ట్ అందజేశారు. పబ్లిక్‌ఫైనాన్స్‌, మాక్రో ఎకనామిక్స్‌ విధానాల రూపకల్పనలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. సీఎస్‌ బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్థికశాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలనూ కూడా ఆయనే నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News