కాలిఫోర్నియా గాళ్స్... ఈ దొంగల ముఠాలో అందరూ మహిళలే!
- అమెరికాలో మేకప్ సామగ్రి చోరీ చేస్తున్న మహిళల ముఠా
- రూ.66 కోట్ల విలువైన మేకప్ సామగ్రి చోరీ
- ఓ ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా చోరీ సొత్తు అమ్మకం
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే... కాలిఫోర్నియా గాళ్స్ ముఠా మేకప్ సామగ్రిని మాత్రమే దొంగిలిస్తుంది. ఏ స్టోర్ లో దొంగతనం చేయాలో మిషెల్ మాక్ స్వయంగా రెక్కీ చేస్తుంది. ముఠాలోని మిగతా సభ్యులు ఆమె సూచించిన స్టోర్ కు వెళ్లి తమ హస్తలాఘవం ప్రదర్శిస్తారు. బాగా పేరున్న బ్రాండ్ల మేకప్ ఉపకరణాలనే వీరు టార్గెట్ చేసేవారు.
ఈ విధంగా ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో చోరీలు చేశారు. చోరీలకు ఈ ముఠా సభ్యులు కార్లు, విమానాల్లో వెళ్లేవారు. ఖర్చులన్నీ ముఠా నాయకురాలు మిషెల్ మాక్ భరించేది.
ఇక, చోరీ చేసిన సొత్తును ఏదో దొంగచాటుగా అమ్ముతారనుకుంటే పొరబడినట్టే. తాము కొట్టుకొచ్చిన మేకప్ సామగ్రిని ఓ ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ లో దర్జాగా విక్రయించేవారు. పైగా, డిస్కౌంట్లు కూడా ప్రకటించి కస్టమర్లను ఆకర్షించేవారు.
పోలీసుల ఈ ముఠా స్థావరంపై దాడులు చేయగా భారీ మొత్తంలో మేకప్ సామగ్రి లభ్యమైంది. ఆ భవనం ఎంత విలాసవంతంగా ఉందో చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవలే కాలిఫోర్నియా పోలీసులు మిషెల్ మాక్ ను అరెస్ట్ చేయడంతో ఈ ముఠా గుట్టురట్టయింది.