Semiconductors: వేగంగా విస్తరిస్తున్న చిప్ తయారీ రంగం.. ఈ ఏడాది చివరినాటికి 50 వేల ఉద్యోగాలు!

50 Thousand Jobs In Semiconductor Industry By The End Of This Year
  • చిప్ తయారీ రంగాన్ని వేధిస్తున్న ఉద్యోగుల కొరత
  • వచ్చే ఐదేళ్లలో 10 లక్షల వరకు ఉద్యోగాలు
  • ఫ్రెషర్లకు సైతం భారీస్థాయిలో వేతనాలు
  • ఎంట్రీ లెవల్ డిజైనర్లకు రూ. 20 లక్షల వార్షిక వేతనం
  • రూ. 1.25 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో మూడు కంపెనీలకు కేబినెట్ ఆమోదం
వేగంగా విస్తరిస్తున్న సెమీకండక్టర్ల (చిప్) తయారీ రంగంలో ఈ ఏడాది చివరి నాటికి 50 వేల ఉద్యోగ నియామకాలు జరిగే అవకాశం ఉందని స్టాఫింగ్‌ సేవల ప్రముఖ సంస్థ ర్యాండ్‌స్టడ్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగాలు 25 నుంచి 30 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 8 నుంచి 10 లక్షల వరకు పెరగవచ్చని పేర్కొంది.

చిప్ తయారీ రంగంలో దేశాన్ని అంతర్జాతీయ హబ్‌గా నిలబెట్టాలని భావిస్తున్న కేంద్రం అందులో భాగంగా 1500 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు) విలువైన పెట్టుబడులతో కూడిన మూడు కంపెనీలకు కేబినెట్ గత నెలలో ఆమోదం తెలిపింది. చిప్ తయారీకి అవసరమైన మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ పార్కులు, టెస్టింగ్ సిస్టంలు, ఆర్అండ్‌బీ వసతుల అభివృద్ధికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరమని ర్యాండ్‌స్టడ్ అంచనా వేసింది. 

వచ్చే కొన్నేళ్లలో చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, చిప్ అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ వసతుల్లో నియామకాలు జోరందుకోవచ్చని  నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రంగాన్ని నిపుణుల కొరత వేధిస్తుండడంతో క్యాంపస్ నియామకాల ద్వారా ఫ్రెషర్లను కూడా నియమించుకునే అవకాశాలు ఉన్నాయని, వేతనాలు కూడా భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎంట్రీ లెవల్ డిజైన్ ఇంజినీర్లకు రూ. 20 లక్షలు, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ. 2.5 కోట్ల వరకు వార్షిక వేతనం లభించే అవకాశం ఉందని ఈ రంగంలోని నిపుణులు పేర్కొన్నారు.
Semiconductors
Chip
Business News
Employment
Semiconductor Industry

More Telugu News