Prakasam District: ఎమ్మెల్యేగా గెలిపిస్తే నా జీతమంతా వాలంటీర్లకే: దర్శి వైసీపీ ఇన్‌చార్జ్

Darsi ycp incharge promises to give his mla salary to volunteers if elected
  • ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో గురువారం వాలంటీర్లకు వందనం కార్యక్రమం
  • కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్శన్ వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి
  • తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వాలంటీర్లకు తన జీతంతో పాటు ఉచిత బీమా

తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వచ్చే జీతమంతా వాలంటీర్ల కోసమే వెచ్చిస్తానని దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో గురువారం వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో పాటు ఆమె కుమారుడు, దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘‘నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెలనెలా వచ్చే జీతమంతా వాలంటీర్ల కోసమే వెచ్చిస్తా. బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా వాలంటీర్లకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తాం. ఆ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. ఒక్కో వాలంటీర్ పరిధిలో 50 ఇళ్లు ఉంటాయి. వాళ్లు వైసీపీకి ఓట్లు వేసేలా కృషి చేయాలి’’ అని శివప్రసాద్ రెడ్డి అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రతినిధుల కంటే వాలంటీర్లకే ఎక్కువ విలువ ఉందన్నారు.

  • Loading...

More Telugu News