Hardik Pandya: హార్ధిక్ పాండ్యాను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించకపోవడానికి కారణం ఇదే!

this Assurance Saved Hardik Pandya From BCCI Contract
  • జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ పరిమితి ఓవర్ల క్రికెట్ ఆడతానంటూ బీసీసీఐకి హామీ ఇచ్చిన పాండ్యా
  • పాండ్యా ప్రస్తుతం రెడ్‌బాల్ క్రికెట్ ఆడే పరిస్థితి లేదన్న బీసీసీఐ సీనియర్ అధికారి
  • ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించి.. పాండ్యాను కొనసాగించడంపై ప్రశ్నలు
  • దీనిపై వివరణ ఇచ్చిన బీసీసీఐ సీనియర్ అధికారి
ఐపీఎల్ 2024 సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని దేశవాళీ క్రికెట్‌కు డుమ్మా కొట్టిన యువక్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్‌ ప్రాధాన్యత దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదేనని చాలా మంది మాజీ క్రికెటర్లు సమర్థించారు. అయితే చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా, రంజీ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడకపోయినా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను మాత్రం గ్రేడ్-ఏ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కొనసాగించడాన్ని పలువురు మాజీలు ప్రశ్నిస్తున్నారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్‌లను సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించి హార్ధిక్ పాండ్యాను కొనసాగించడాన్ని ప్రశ్నించాడు. పాండ్యా లాంటి ఆటగాళ్లు జాతీయ జట్టులో లేనప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌ ఆడకూడదనుకుంటే వైట్ బాల్ క్రికెట్‌లో పాల్గొనాలా? అని బీసీసీఐని ప్రశ్నించాడు. అందరికీ ఒకే రూల్స్ ఉండాలని అన్నాడు.

అయితే తాను జాతీయ జట్టుతో లేనప్పుడు దేశవాళీ ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్లు అయిన సయ్యద్ ముస్తాక్ అలీ (T20), విజయ్ హజారే ట్రోఫీలలో ఆడతానంటూ బీసీసీఐ, సెలెక్టర్లకు హార్ధిక్ పాండ్యా హామీ ఇచ్చాకే గ్రేడ్-ఏ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తన కథనంలో పేర్కొంది. ఎలాంటి షరతులు లేకుండా ఈ టోర్నీలలో భాగస్వామ్యం అవుతానని పాండ్యా చెప్పినట్టు తెలిపింది. వన్డే వరల్డ్ కప్-2023 సమయంలో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా చీలమండ గాయానికి గురయ్యాడు. దీంతో వరల్డ్ కప్ మధ్యలోనే అతడు వైదొలగాడు.

అందుబాటులో ఉన్నప్పుడు దేశవాళీ పరిమితి ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొనడంపై పాండ్యాతో మాట్లాడామని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పినట్టు ఆ కథనంలో సదరు మీడియా ఉటంకించింది. ‘‘ బీసీసీఐ వైద్య బృందం అంచనా ప్రకారం పాండ్యా ప్రస్తుతం టెస్టు ఫార్మాట్ క్రికెట్‌లో బౌలింగ్ చేసే స్థితిలో లేడు. కాబట్టి పాండ్యాకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు రంజీ ట్రోఫీలో ఆడటం ప్రామాణికం కాదు. అయితే టీమిండియాకి ఆడని సమయంలో ఇతర వైట్-బాల్ టోర్నమెంట్‌లలో ఆడతానని చెప్పాడు. అలా ఆడకపోతే అతడు కూడా కాంట్రాక్ట్‌ను కోల్పోతాడు’’ అని బీసీసీఐ అధికారి తెలిపినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది.
Hardik Pandya
BCCI
Cricket
BCCI Central contract

More Telugu News